పుట:Mahaapurushhula-jiivitamulu.pdf/453

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

386

మహాపురుషుల జీవితములు

ఇప్పటికి మహారాజుగారివద్ద నొక సంవత్సరము పనిచేసి తాను ప్రారంభించిన సర్వేసెటిలుమెంట్లు రెండు తాలూకాలలోమాత్రమే సమాప్తమగునప్పటికీ నతఁడు తిరువాన్కూరువదిలి పెట్టవలసివచ్చెను. రామయ్యంగారు సంస్థానమును విడిచి వెళ్ళుటకు కొన్ని దినముల పూర్వమందు ప్రస్థుత మహారాజుగారు మంత్రిపేర నొకజాబువ్రాసిరి. ఆజాబులో రామయ్యంగారు జనుల యభివృద్ధికై యాఱు సంవత్సరములు పాటుపడినట్లు వ్రాసిరి. ఈవిధముగానే ఇంగ్లీషువారు రెసిడెంటుకూడ వ్రాసెను. 1887 వ సం|| మున రామయ్యంగారు తిరువాన్కూరు సంస్థానము విడిచి తనజీవితకాల శేషము మత వ్యాసంగములలో గడఁపదలఁచి చెన్నపురముంజేరెను. కాని యా సంవత్సరము చెన్న పట్టణములలో గాసిన యెండల వేడిమి యాయన శరీరమునకు బడక జ్వరబాధగలిగించెను. ఎన్ని చికిత్సలు చేసిననది నివారితముగాక యెట్లకేల కాయన ప్రాణము దీసి చెన్న పట్టణమునకు సత్పురుష వియోగము గావించెను.

రామయ్యంగారు పుస్తకములు చదువుటయందు మిక్కిలి తమకము గలవాడు. చెన్నపట్టణపు పుస్తకముల దుకాణములలో గ్రంథములు కొననినెల, సీమనుండి పుస్తకములు తెప్పింపని నెల లేదని, చెప్పవచ్చును. ఆయన మరణానంతరము భార్య యాతని గ్రంథ భాండారము శ్రీపచ్చప్పయ్యగారి కళాశాలకు బహుమానముగా నిచ్చెను. అక్కడ నిప్పటికి రామయ్యంగారు శ్రద్ధతోఁ జదివిన యానవాళ్ళు గల పుస్తకములు మనమిప్పుడు చూడవచ్చును. తనవద్దకు వచ్చిన వారి కందఱకు నతఁడు మంచిపద్ధతుల నేర్పరుచు సంభాషణమునందు