పుట:Mahaapurushhula-jiivitamulu.pdf/446

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట అచ్చుదిద్దబడ్డది
379
వెంబాకం రామయ్యంగారుచేయుచున్న యుద్యోగమవసరమే లేదని తీసివేసిరి. 1866 వ సంవత్సర మంతయు నితఁడా యుద్యోగమునం గడపెను. 1867 వ సంవత్సరమందు స్టాంపులసూపరింటెండెంటగు టెంపిలుదొర కాలధర్మము నొందగా దొరతనమువారు నెలకు వేయిరూపాయల జీతముమీఁద రామయ్యంగారి నాయుద్యోగమునం బ్రవేశపెట్టిరి.

మఱుసటి సంవత్సరము గవర్నరుగారి శాసన నిర్మాణసభలో నొక సభికుఁడుగ నతఁడు నియమింపఁబడెను. ఈ సభలో నతఁడు పండ్రెండు సంవత్సరములు సభికుఁడుగనుండి క్రొత్తచట్టములునిర్మించునపుడు గవర్నమెంటువారి కెంతో సహాయముఁజేయుచు వచ్చెను. అతఁడు ముఖ్యముగ శ్రమపడి పనిఁజేసినవి రెండు విషయములు గలవు. అవి యేమనఁగా మునిసిపలు లోకలుఫండు సంబంధమయిన పన్నులు కట్టుటకు గవర్నమెంటువారు నిర్మించిన చట్టములోనితఁడు మిక్కిలి సహాయముఁచేసెను. ఆచట్టము నిర్మించిన అలెగ్జాండరు ఆర్బత్తుదొరగారు వ్రాసిన యీక్రింది జాబుఁ జదివినయెడల రామయ్యంగారెంత సాయముచేసెనో తెలియును. "ఇవి యిప్పుడు చట్టములైనవిగనుక నిదివఱకు నే నన్న నోటిమాటలే యిప్పుడు కాగితము మీఁద బెట్టుచున్నాను. ఈశాసన నిర్మాణములో నీవుచేసిన యపార సహాయమునకుఁ జెప్పిన యాలోచనకు నేను మిక్కిలి కృతజ్ఞుఁడనై యున్నాను. జాగ్రత్తతో అమలుజఱుపఁబడిన పక్షమున నీ రెండు చట్టములు జనులకు మిక్కిలి లాభకరములుగ నుండునట్లు నిర్మింపఁబడినవని నాయభిప్రాయము. మనమనుకున్నట్లే నిజముగా జరిగిన పక్షమున మొదటిశాసనము నిర్మాణముఁ జేయునపుడు రెండవసారి దానిం దిరుగ వేయునపుడు నీవుచేసిన సహాయమే దానికి గారణము" రామయ్యంగారు చదువుకొన్న పాఠశాలయొక్క సంవత్సరోత్సవము