పుట:Mahaapurushhula-jiivitamulu.pdf/444

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

[48]

వెంబాకం రామయ్యంగారు

377



తెల్లవారికంటె నాపనికిఁ దగినవాఁడవని నీవిషయమై సిఫారసు చేసిరి. తంజావూరు మండలములో సగము భాగములోనున్న జనుల యదృష్టములు నీచేతిలోనున్నను నీపూర్వప్రవర్తనముమీఁద నెక్కడనొకమచ్చ లేకుండ ననుమానపునీడయైన నీమీఁద సోకకుండ నీవా వ్యవహారము న్యాయైకదృష్టితో నెల్లరకుఁ దృప్తికరముగఁ బరిష్కరించితివి. తంజావూరులో వ్యవహారము ముగియగానే యీనాము కమీషనులోఁ జేరవలసినదని యదివఱకు రామయ్యంగారి కుత్తరువులు వచ్చెనుగాని తంజావూరు కలక్టరాయనను విడువక తనకు సహాయుఁడుగ నేర్పఱచుకొనెను. ఇక్కడ నుండగానే గవర్నమెంటువా రాయనను మఱియొక వ్యవహారముఁ బరిష్కరింపుమని పంపిరి.

1858, 59 వ సం||రములలో కావేరీనది వలన దేశమునకు గొప్పనష్టము కలిగెను. అప్పుడు చెడిపోయిన ప్రదేశములకు మరమ్మతులు చేయుటకై గవర్నమెంటువారు మిరాశిదారులకు గుత్త దారులకు వేలకొలఁది రూపాయలిచ్చిరి. ఆమరమ్మతులు సరిగా జరిగినవో లేదో తెలిసికొని గవర్నమెంటువారికి గుత్తదారులకుఁగల వ్యవహారముఁ బరిష్కరించుటకు రామయ్యంగా రేర్పడెను. ఈకృత్యము నతఁడు శ్రద్ధతో నెఱవేర్చి గుత్తదారులవల్ల దొరతనమువారికి రావలసినసొమ్ము విశేషముగా రాఁబట్టెను. తరువాత నతఁడు తంజావూరు జిల్లలోనేయున్న నల్లతాడిగ్రామ వ్యవహారముఁ బరిష్కరించుటకై నియమింపఁబడెను. ఈగ్రామము చెన్నపట్టణపు నివాసులైన యొక కుటుంబమువారికి మొఖాసాగా నుండెను. గవర్నమెంటుకుగ్రామము మీఁద జెల్లవలసిన శిస్తు మితిమీరి యుండుటచే ముఖాసాదారులు దానిమొగముఁజూడక పాడుపెట్టిరి. రామయ్యంగారు శిస్తు తగ్గించి