పుట:Mahaapurushhula-jiivitamulu.pdf/428

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

361

సర్. కె. శేషాద్రి అయ్యరు

ఈయనబొమ్మ దొరక లేదు. శేషాద్రయ్యరు చెన్నపురి రాజధానిలో మలబారు జిల్లాలోనున్న పాలఘాటునకు సమీపమందున్న కుమరాపురము గ్రామమున 1845 వ సమవత్సరము జూనునెల యొకటవ తేదీని జన్మించెను. ఆయన కళ్ళికోటలోనున్న దొరతనమువారి పాఠశాలలో మొట్టమొదట విద్యాభ్యాసముఁ జేసెను. ఆపాఠశాల గోడలమీఁద నిప్పటికి నీయనపేరు బంగారువర్ణములతో వ్రాయఁబడి మెఱయుచున్నది. అక్కడ చదువు ముగిసినపిదప నతఁడు చెన్నపురికిఁ బోయి ప్రసిడెన్సీకాలేజిలోఁజేరి 1866 వ సంవత్సరమునఁ బట్టబరీక్ష యందుఁ గృతకృత్యుఁ డయ్యెను. తరువాతఁ గొన్ని యేండ్ల కాయన బి. యల్. పరీక్షలోఁగూడ కృతార్థుఁడయ్యెను. విద్య ముగిసిన పిదప శేషాద్రియయ్యరు మలబారు జిల్లాకలక్టరగు బేలర్డుదొరచేత నతని కచ్చేరీలో భాషాంతరీకరణముఁ (తర్జుమా) జేయు నుద్యోగస్థుఁడుగా నియమింపఁబడెను. కాని శేషాద్రి చిరకాల మాయూద్యోగములో నుండలేదు.

శేషాద్రి చదువుకొనుచున్న కాలమునందే రంగాచార్యులతో స్నేహముచేసెను. అందుచేత రంగాచార్యులు మైసూరు సంస్థానమున నుద్యోగము సంపాదించినప్పుడు శేషాద్రినిఁ బిలిపించి యష్టగ్రామమండల మండలాధికారివద్ద శిరస్తాదారుగ నేర్పరచెను. శేషాద్రి మైసూరుసంస్థానమున గొప్పపేరు సంపాదించుటకు మిక్కిలి యవకాశముండెను. సహజముగ బుద్ధిసూక్ష్మతయు మంచిపూనికయుఁ గలవాఁడగుటచే నయ్యరు తన పాలఁబడిన కృత్యములెల్ల నతిశ్రద్ధతో నెఱవేర్చుచువచ్చెను. ఆయన ప్రవేశించు నప్పటికి మైసూరు ప్రభువు బాలుఁడైనందున నాంగ్లేయ దొరతనమువారి పాలనలో నుండెను.