Jump to content

పుట:Mahaapurushhula-jiivitamulu.pdf/426

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

సేలము రామస్వామి మొదలియారి

359



గూర్చి యెక్కువపని జేయవలయునని యాంగ్లేయులకుఁ దోఁచెను. తక్కినవారి యుపన్యాసము లటుండఁగా రామస్వామి మొదలియారి యుపన్యాసములు విశేషప్రీతి నింగ్లాండుజనుల కొసగెను. యేలయన నాయనమొగము కాటుక కన్నులు గలిగి మంచి తేజస్సు గలిగి యెంతో సుందరమై చూచినంత మాత్రముననే యెల్లవారలకు నాతనిమీఁద నాదరము గలుగఁ జేయునట్లుండెను. అతని సంభాషణ మాకారమునకు దగినట్లే గంభీరమై యుండెను. ఇంగ్లాండులోఁ గొంతకాల ముండుటచేత రామస్వామి మొదలియారి యాంగ్లేయ భాషాప్రవీణతయు వాగ్ధోరణియు మిక్కిలి యధికము లయ్యెను. హిందువులయెడల నమ్మికయుంచి యాదరముతో రాజ్యపరిపాలనము జేయుడని యాతఁడు కృపారస ముట్టిపడునట్లుజేసిన యుపన్యాసములు వారి హృదయములమీఁద ముద్రితము లైనట్లుండెను.

రామస్వామి మొదలియారి సముద్రయానముం జేసి విదేశముల గొంతకాలము గడపినను హిందూధర్మములకు విరుద్ధములుగ నెన్నడు నాచరింపక మనదేశపు సేవకునొక్కని వెంటబెట్టుకొనిపోయి వానిచేతి యన్నమే తిని కాలక్షేపము జేసెను. ఇంగ్లాండు దేశస్థులనేకు లతనిని విందునకు పిలువగా నతఁడట్టి విందులకు దఱుచుగాబోవక పోకతప్పనప్పుడు పోయి వారిచేత మాంసాదులు భక్షింపక కాయగూరలు పండ్లు మొదలగువానిని భక్షించుచువచ్చెను. అతని కులస్థులు గూడ నాతని నియమము లిట్టివని యెఱింగి సణుగుకొనక గొణుగుకొనక యనుచితములై యర్థము లేని ప్రాయశ్చిత్తముల విధీంపక రాగాఁనే యతనిం గులములోఁ జేర్చుకొనిరి. రామస్వామి మొదలియారి తిరిగి స్వదేశమునకు వచ్చినప్పుడు చెన్నపురవాసు లాయనయెడ జూపిన సన్మాన మిట్టిదియని వర్ణింపరాదు. సేలములో జరిగిన సన్మానము జెన్నపురిలో జరిగినదానికంటె విశేషముగా నుండెను. ఇంగ్లాండు