పుట:Mahaapurushhula-jiivitamulu.pdf/425

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

358

మహాపురుషుల జీవితములు



లలోఁ నతఁడెంత ధైర్యశాలియో యీక్రింది పనివల్లఁ దెలిసికొన వచ్చును. 1883 వ సంవత్సరమునఁ జెన్నపురి గవర్నరుగారి యాలోచన సభలోని సభికుఁడొకఁడు ఫించనుపుచ్చుకొని యింగ్లాండునకుఁ బోవ నుద్యుక్తుడై యుండ చెన్నపురవాసు లాయనను గౌరవించి యుత్సవములఁ జేయ దలంచిరి. అట్టి యుత్సవములఁ జేయుటకూడదని రామస్వామి మొదలియారి నిరాఘాటముగాఁ బలికెను.

చెన్న పట్టణములో స్థాపింపఁబడిన మహాజనసభ, తెల్లవారు నల్లవారని మునుపటియ ట్లనాదరముసేయక గౌరవముతోఁ జూచునట్లు చేయుటకు దక్షిణ హిందూస్థానమున స్వదేశస్థుల మొరలు ధైర్యముతో దొరతనమువారికి విన్న వించుటకు ముఖ్యాధారమయ్యెను. ఆమహాజనసభలో రామస్వామి మొదలియారి ప్రధాన పురుషుఁ డన్నమాట యెల్ల వారికి విదితమే.

హిందూదేశ పరిపాలనమునుగూర్చి నిజమయిన స్థితిగతుల నెఱుఁక యింగ్లాండులోనుండు నాంగ్లేయులకు, యధార్థస్థితినిఁ దెలియజేయుటకు మన దేశస్థులలో గొందఱింగ్లాండునకుఁ బోవుట యుచిత మని మనదేశాభిమాను లనేకులు తలంచి చెన్నపట్టణమునుండి రామస్వామి మొదలియారిగారిని మనరాజధానికిఁ బ్రతినిధిగాఁ బంప నిశ్చయించుకొనిరి. ఈపనినిమిత్తమే బంగాళమునుండి బాబుసురేంద్రనాథ బెనర్జీగారును బొంబాయినుండి మఱియొకరును బంపఁబడిరి. రామస్వామియు సహప్రతినిథులుఁ గలసి యింగ్లాండులోఁ జాల సభలుచేసి హిందూదేశ వ్యవహారములను వారికి సుబోధకములుగ జెప్పిరి. ఇతఁ డక్కడనున్న దినములలో నాదేశస్థులలోఁ గొందఱీతని సహాయమున హిందూదేశ రాజకార్యములను గూర్చి చర్చలు సలుపుట కొక సభ స్థాపించిరి. ఈతఁడును దక్కిన ప్రతినిధులుఁ జేసిన యుపన్యాసములనుబట్టి యా కాలమున హిందూదేశ పాలనమును