పుట:Mahaapurushhula-jiivitamulu.pdf/422

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

సేలము రామస్వామి మొదలియారి

355



యందుఁ గృతార్థుఁడైన వెంటనే యాతనికిఁ దన కళాశాలలో నింగ్లీషు పండితోద్యోగ మిచ్చెను. కాని తనకంటె తక్కువగా అనగా రెండవ వాడుగ బట్టబరీక్షయందు గృతార్థుడైన యొక మిత్త్రుడు చాలపేదతన మనుభవించుచు నుద్యోగమునకు బ్రయత్నించుట యెఱింగి రామస్వామి దయాళువగుటచే దనకాయుద్యోగ మక్కఱ లేదని చెప్పి యామిత్త్రున కిప్పించెను.

ఇట్లు 1871 వ సం||న నతడు పట్టపరీక్షయందు గృతార్థుడై విద్యాసక్తి యప్పటికిని బోనందున నాకళాశాలలోనే యుండి యం. యె. (అనగా సర్వకళాధికారి) పరీక్షకు జదివి యందు 1873 వ సంవత్సరమున గృతార్థుడయ్యెను. అనంతరము బి. యల్. పరీక్షకుం జదివి 1875 వ సంవత్సరమున దానియందును మొదటివాడుగా దేఱెను. 1876 వ సం||ము హైకోర్టు వకీలుగా జేయబడి రామస్వామి మొదలియారి స్వగ్రామమగు సేలములోనే న్యాయవాదిగ నుండ దలిచి యక్కడ పనిచేయ నారంభించెను. నిగర్వియై పని జేయుటలో మిక్కిలి పూనిక గలిగియుండినందున రామస్వామి జిల్లాజడ్జి కిష్టుడగుటయేగాక సేలములోనున్న స్వదేశస్థుల కందఱకు మిక్కిలి యిష్టుడయ్యెను. అతడక్కడ కొన్ని మాసములు మాత్రమే పనిజేసి దొరతనమువారి కొలువులో జేర నిచ్చగలవాడై డిస్ట్రిక్టు మునసబు పనికి బ్రయత్నముజేయ నిశ్చయించుకొని జిల్లాజడ్జీద్వారా దరఖాస్తు పంపగా నాదరఖాస్తుమీద జడ్జి యాతని నిరుపమాన బుద్ధికుశలతనే గాక సత్ప్రవర్తనముం గూడ శ్లాఘించి యన్నివిధములచేత నతడా యుద్యోగమునకు దగినవాడని వ్రాసెను. అనంతరమతఁడు 1876 వ సం||ననే తిరుచునాపల్లిలో డిస్ట్రిక్టు మునసబుగా జేయబడెను. ఈయన నిష్పక్షపాతబుద్ధికి సత్యసంథతకు బేరుపడెను. వ్యవహారములలో స్వతంత్రముగాను మనసునకు దోచిన విధముగాను పక్షపాత