పుట:Mahaapurushhula-jiivitamulu.pdf/416

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట అచ్చుదిద్దబడ్డది
351
సెట్టిపాణియం వీరవలి రంగాచార్యులు

రంగాచార్యుడు మంత్రియైన తోడనే వెనుక గార్డనుదొర మొదలు పెట్టిన మార్పులను గొనసాగింప బూనుకొనెను. హస్సాను, చిత్రదుర్గ మండలములు సివిలు క్రిమినలు వ్యవహారముల నిమిత్తము వేఱు వేఱు జిల్లాలుగ బరిగణింపబడెను. 9 తాలూకాలు డిప్టీ తహసీలుదారుల యదికారముక్రింద నుంచబడెను. మూడు మునసబుకోర్టులు 4 సబుకోర్టులు తీసివేయఁబడెను. 8 జిల్లాల చెఱసాలలలో నైదు తీసివేయఁబడెను. బాటసారులు బసలుదిగు బంగాళాలమీద నదిఁవఱ కేర్పడిన జీతగాండ్రు చాలమంది తగ్గింపఁబడిరి. ఈ తగ్గింపుల వలన సంస్థానమునకు సంవత్సరమునకు రమారమి రెండు లక్షల రూపాయలు మిగిలెను. ఆమార్పులు ముగిసిన పిదప రంగాచార్యులు సంస్థానములోని యడవి డిపార్టుమెంటువైపు తనదృష్టిని మరల్చెను. ఆసంస్థానములో నడవులు చాలభూమి నాక్రమించియుండెను. కలప విశేషము జనులకుఁ గావలసియుండెను. అందు నియోగింపబడిన యుద్యోగస్థులదుర్నీతివలన, సరకువచ్చుటకు సుళువైన మార్గములు దేశమున లేకపోవుటవల్ల, మహారాజున కా డిపార్టుమెంటులో రావలసినంత సుంకమువచ్చుటలేదు. ఆరాజ్యములో దొరకెడు మంచిగంధపుఁ గఱ్ఱల జనులెవ్వరమ్మగూడదు. కొనగూడదు. దొరికిన మంచిగంధపు దారులన్నియు రాచనగరులలోనే యేదోవిధముగ నుపయోగింపఁ బడుచువచ్చెను. రంగాచార్యుఁ డాపద్ధతిమాన్పి చందనమందఱకు సులభసాధ్యముచేసెను. ఈపనులవలన నడవులనుండి సంస్థానమునకు హెచ్చుసుంకము రాజొచ్చెను. ఈవిధమునఁ గొంతద్రవ్యముమిగిల్చి యామంత్రిపదునొకండు లక్షల రూపాయలు పెట్టుబడిపెట్టి మైసూరు ప్రభుత్వమువారు చిరకాలము క్రిందట తల పెట్టి నెర వేర్ప లేకపోయిన యినుపదారిని కొనసాగించెను. పొగబండ్లునడచు నినుపదారి నలవలె దేశమంతటనలముకొనునట్లె వేయించవలయునని యతని సంకల్పము