పుట:Mahaapurushhula-jiivitamulu.pdf/410

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

[44]

సెట్టిపాణియం వీరవలి రంగాచార్యులు

345



నకు మరలెను. టెయిలరుదొరకు రంగాచార్యునిమీద నెంతగౌరవమున్నదో వాని స్వహస్తలిఖితమైన యీ జాబువలన దెలియును. "అతడు (రంగాచార్యులు) పాఠశాలను విడిచి, 1849 వ సంవత్సరములో దొరతనమువారి కొలువులో బ్రవేశించినది మొదలుకొని మేమిరువుర మెడతెగని సంబంధము గలిగియుంటిమి. మా కొండొరుల యెడగల గౌరవము రవ్వంతయు డిందుపడలేదు. ప్రప్రథమమున నేనతనికి బని నేర్పుటలోను, బిమ్మట గొప్పయుద్యోగము లిప్పించి వృద్ధికి దెచ్చుటలోను కొంతసహాయము చేసినను రంగాచార్యుడు నా యెడల జూపిన భక్తివిశ్వాసముల చేత నాఋణమంతయు దీర్చెను. మాయిరువురకు నుద్యోగ సంబంధ మున్న కాలమంతయు రంగాచార్యులు స్వదేశస్థుల ప్రవర్తనలగూర్చి యతనికిగల జ్ఞానము, వాని యుత్కృష్టవివేకము, యద్భుతమైన యతనికార్య నిర్వాహక సామర్థ్యము విసుగుకొనక యతినిపుణముగా నానిమిత్తమె వినియోగించెను. నేయేల, మాకిరువురికి సంబంధముగల సమస్త వ్యవహారములలోను నేను కృతకృత్యుడ నగుట యెల్ల రంగాచార్యుని సహాయ సంపత్తిచేతనే యని దృఢముగా జెప్పగలను" అనంతరము కొంత కాలమునకు టెయిలరుదొర చెన్నపురిరాజధాని పక్షమున గవర్నరు జెనరలుగారి శాసన నిర్మాణసభలో సభికుడై, చట్టములు నిర్మించినపుడు రంగాచార్యుని యాలోచన మడుగుచు నీతడిచ్చిన సలహాలను విస్పష్టముగ గవర్నరు జెనరలుగారి సభలో జెప్పుచువచ్చెను. కలకత్తానుండి చెన్న పట్టణము తిరిగివచ్చిన తరువాత రంగాచార్యులు మదరాసు రెయిల్వే కంపెనీకి కమీషనరయ్యెను. దొరతనమువారు కాకితపునాణెములు (అనగా కర్రెన్సీనోట్లు) క్రొత్తగా వ్యవహారములోనికి దెచ్చి, 1864 వ సంవత్సరమున రంగాచార్యుని పశ్చిమదేశముననున్న కల్లికోట జిల్లాలో ట్రెజరీ డిప్యూటీ కలెక్టరుగా వేసిరి.