పుట:Mahaapurushhula-jiivitamulu.pdf/409

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

344

మహాపురుషుల జీవితములు



కమీషనుయొక్క ప్రెసిడెంటగు టెయిలరు దొరవారివద్ద స్పెషల్ అసిస్టెంటుగా నియమింపఁబడెను. రంగాచార్యులు తన వివేక సామర్థ్యములవల్ల టెయిలరు దొరకు విశ్వాసపాత్రుఁడై యేడుసంవత్సరములా డిపార్టుమెంటులోఁ బనిచేసెను. ఈనాముల పరిష్కారము ముగిసిన పిదప దొరతనమువారు మన దేశములోనున్న యినుపదారుల (Railways) పద్ధతి యెట్లు జరుగుచున్నదో తెలియజేయవలయునని టెయిలరు దొరవారిని నియోగించిరి. ఈ పనికి బాగుగ లెక్కలు తెలిసినవారు కావలసివచ్చినందున టెయిలరుదొర రంగాచార్యునిఁ దనకు సహకారిగాఁ దీసికొనెను. రంగాచార్యులు ప్రధాన మంత్రులతోను, ముఖ్యబంధువులతోను గలసి యాలోచింపకుండ నీ యుద్యోగములోఁ బ్రవేశించుట కొడంబడెను. గృహమునకుఁబోయి యావార్త చుట్టముల కెఱిగింప వారు టెయిలరుదొరతో నతఁడు చేసిన వాగ్దానమునుండి వానిని మరల్పఁ బ్రయత్నించిరి. ఏలయన నతఁడు కలకత్తాకు సముద్రముమీఁద నోడప్రయాణము జేయవలసి వచ్చెను. ఆనాఁటి పూర్వాచార ప్రియులగు బ్రాహ్మణులు రంగాచార్యులవంటి యగ్రకులజుఁడు సముద్రముమీఁద నావికా యాత్ర చేసినపక్షమున బ్రాహ్మణ్యము చెడిపోవుననియు నటుమీఁదనందఱు నదే మొదలుపెట్టి వర్ణాశ్రమధర్మములు పాడుచేయుదురనియు గోలపెట్టిరి. కాని రంగాచార్యులు నాగరికతా విషయమునఁ దనసాఁటి వారి తలదాటినవాఁడగుటచే వారుపెట్టిన గోలు సరకుసేయక వెలికి జంకక టెయిలరుదొరతోఁ గలసి యోడమీఁద కలకత్తాకును, బనియున్న యితర స్థలములకునుఁ బోయెను. పోయి చాల యోపికతో నీతితో దనపని నిర్వర్తించుకొని తన పై యధికారి నమ్మికకు మునుపటికంటెను మిక్కిలిగా పాత్రుడయ్యెను. తనకు నధికారులకు సంతుష్టి కలుగునట్లు కార్యనిర్వాహముచేసి రంగాచార్యులు స్వదేశము