పుట:Mahaapurushhula-jiivitamulu.pdf/408

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

సెట్టిపాణియం వీరవలి రంగాచార్యులు

343



రయిరి. ఆహైస్కూలులో నతఁడు 1840 వ సంవత్సర ప్రారంభము వఱకు విద్యాభ్యాసముచేసి యప్పుడు ప్రోఫీషెంటె పరీక్షలో మొదటి తరగతిలోఁ గృతార్థుఁడయి గౌరవాస్పదుఁ డయ్యెను. తరువాత రంగాచార్యులు దొరతనమువారి కొలువులోఁ బ్రవేశించుటకు మఱియొక పరీక్షకుఁ జదువుచుండుట విని పవెల్‌దొర వానియెడ మంచి యభిప్రాయముఁ గలవాఁడు కావున వాని కీక్రింది విధమున వ్రాసెను. "నీవు పరీక్షారంగమునఁ బ్రవేశించుచున్నాఁడవనియు మాపాఠశాల పరువు నిలువఁబెట్టఁ బ్రయత్నింతువనియు విని చాల సంతసించితిని. నీయందు సామర్థ్యము, దానికిందోఁడు చాకచక్యము, వివేకముఁ గలవు. కావున నీవు తప్పక జయము నొందెదవు".

విద్యార్థి దశలో నతనికిఁ గలిగిన యద్వితీయ విజయమువలన వానికీర్తి చుట్టుప్రక్కల వ్యాపించుటచే నతఁడు విద్యముగింపఁగానే చెన్న పురమం దప్పుడు కలెక్టరుగానున్న యెల్లిసుదొర వానికిఁ దన కచ్చేరిలోఁ నొకనికి బదులుగా కొన్నాళ్ళు గుమస్తాపని యిచ్చెను. అనంతర మతఁడు చెంగల్పట్టుజిల్లా కలెక్టరు కచ్చేరిలో ఖాయపు గుమాస్తాగా నియమింపఁ బడెను. అక్కడ కొన్నాళ్ళుండినతరువాత నతఁడు సేలంజిల్లా కలెక్టరుగారి కచ్చేరిలో హెడ్‌క్లర్కుగా హెచ్చుజీతముమీఁద బంపఁబడెను. ఈకాలమునఁ నతఁడు రెండు చిన్న పుస్తకములను వ్రాసెను. అందొకటి రివిన్యూ డిపార్టుమెంటులోని యుద్యోగస్తులు లంచములను పుచ్చుకొనుటఁగూర్చి. రెండవది యాకాలములోఁ నందఱుఁ దీవ్రముగాఁ జెప్పుకొనుచున్న సేలము తంజావూరు జిల్లాలోని మిరాసీహక్కులను గురించి పిమ్మట నతఁడు సైదాపేట తహసీలుదారుగా వెళ్ళి యాపనిలో రెండేండ్లుండెను. అక్కడ నుండి నెల్లూరు జిల్లా సిరస్తాదారుగాఁ బోయెను. 1859 వ సంవత్సరమున గవర్నమెంటువారు చెన్నపురిరాజధానిలో నేర్పరచిన యీనాము