పుట:Mahaapurushhula-jiivitamulu.pdf/407

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

342

మహాపురుషుల జీవితములు



నీబాలుఁడు నిశ్శబ్దముగ వారిసమీపమునఁ గూర్చుండి మెలఁకువతో నయ్యాటలోని చమత్కృతులన్నియు గ్రహించి యల్పకాలములోనే దానియందు మిక్కిలి ప్రౌఢుఁడయ్యెను. ఆతని ప్రౌఢిమ మెఱిఁగి చదరంగమాడు పెద్దలు మంచియెత్తులు తమకుఁ దోచనప్పుడు, తమ యాట చిక్కులలోఁ బడినప్పుడు పలుమాఱు బాలుఁడగు రంగాచార్యుని సాయ మపేక్షించుచు వచ్చిరి. అడగుటయే తడవుగ నీ కుశాగ్రబుద్ధి యసమానములగు నెత్తులుచెప్పి వారి యాటచిక్కుల విప్పుచువచ్చెను. రంగాచార్యునకువిద్యమీఁదకంటె నాటపాటలయం దెక్కువ తమక ముండెను. అట్లున్నను స్వల్పపరిశ్రమముమాత్రము చేసి చదువులో తోడిబాలుర మించుచువచ్చెను. ఆతఁడు మొట్ట మొదట పచ్చెయ్యప్పపాఠశాలలోఁ బ్రియజ్ఞాన మొదలియారి యను నాతనివద్ద చదివెను. పెద్దవాఁడైన తరువాత సైతమీయాచార్యులు తన చిన్న నాఁటియుపాధ్యాయునియెడ గౌరవము, ప్రేమయుఁ గలిగి చిన్న బిడ్డలకు మొదటితరగతులలో నుపాధ్యాయులుగా నుండగోరు వారాయనవలె నుండవలెనని చెప్పుచువచ్చెను. ప్రియజ్ఞాన మొదలియారి వయోవృద్ధుడయి యుద్యోగము మానుకొని యింట నిబ్బందులు పడవలసివచ్చినప్పుడు ప్రాఁత శిష్యుఁడైన రంగాచార్యులు గురుభక్తిఁ గలిగి ద్రవ్యసహాయము చేయుచువచ్చెను. పచ్చెయ్యప్ప పాఠశాలలోఁ జదువు ముగిసిన పిదప రంగాచార్యులు చెన్న పట్టణపు హైస్కూలులోఁ బ్రవేశించెను. దాని ప్రధానోపాధ్యాయుఁ డగు పవెలుదొర బాలుని మేథాశక్తికి సంతసించి నెలకుఁ బదునాలుగు రూపాయల విద్యార్థివేతనముగ వాని కీయఁదొడఁగెను. పవెలుదొర వద్ద బుద్ధిసంపూర్ణముగ వికసింప నతఁడుప్రజ్ఞలోఁ దక్కినవిద్యార్థుల నంతఱ మించుటఁజేసి వారు వానితో సమానముగ నుండఁగోరక వాని తరువాత వారుగానైన నుండినం జాలునని కోరవలసినవా