పుట:Mahaapurushhula-jiivitamulu.pdf/402

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

పూండి రంగనాథము మొదలియారి

339



రంగనాథునకు గలిగిన మహాఖ్యాతి వాని బుద్ధివిశేషముచేతనేగాని నిరంతరము పాటుబడుటవలనగాదు. దీని బట్టి యాతఁడు పాటుపడు వాడు గాడని మాయభిప్రాయముగాదు. కొందఱు మేథావంతులు కాకపోయిన విశేష పరిశ్రమముజేసి గొప్పవారగుదురు. రంగనాథము మొదలియారి నిరుపమానమైన బుద్ధిసూక్ష్మత గలిగి దానికిం దోడుగ బరిశ్రమజేసి ఖ్యాతిగాంచినవాడు. రంగనాథము మొదలియారి సంభాషించుచుండగా విన్న వారు మహానందభరితు లగుచుందురు. ఆతని భాషాశైలి మనోహరమై చాకచక్యముగలిగి మనస్సు నానందవార్థి నోలలాడించుచుండును. ప్రసంగములో నడుమనడుమ నతఁడు మహాకవుల యుద్గ్రంథములలోనుండి సంతోషజనకములైన పద్యములను వాక్యములను దీసి కంఠపాఠముగజదివి వినువారి వీనుల కెంతయు విందుచేయుచుండును. ఆంగ్లేయభాషలో నతనికి షేక్స్పియరు మహాకవియొక్క కవిత్వము మిక్కిలి ప్రియమైనది.

సాధారణముగ నింగ్లీషుభాషలో బ్రవీణతగల విద్వాంసులకు స్వభాషాపరిచయముండుటయరిది. రంగనాథము మొదలియారి విషయమట్లుగాదు. ద్రావిడభాషయందు మహాపండితులతో సమానమైన పాండిత్యము వానికిగలదు. ప్రసంగము వచ్చినప్పుడు సందర్భశుద్ధి యెఱిఁగి యతఁడు ద్రవిడ భాషలోనున్న కంబరామాయణమునుండి కొన్ని పద్యములనుదీసి చదివి దానిలోనుండు భావాదులనుమిత్రులకు బోధించుచుండును. ఈ కాలమున నింగ్లీషుభాషలోఁ గృషిచేయ విద్యార్థులు స్వభాషను బొత్తుగ నెఱుగక చెడిపోవుచున్నారని యాయన పలుమారు మిత్రులతోజెప్పి విచారించుచుండును. ఆయన సర్వవిధములచేత మిక్కిలి పెద్దమనుష్యుఁడు. తరుచుగా గొప్పవారితో సహవాసము చేయుటచేత నాతనిపద్ధతులు మిక్కిలి మంచివై యుండెను. అతని హృదయము మిక్కిలి మెత్తనిది. ఆయన జీవితములోఁ