పూండి రంగనాథము మొదలియారి
పూండిరంగనాథము మొదలియారి చెన్న పట్టణమున 1847 వ సంవత్సరమున జన్మించెను. ఆతనితండ్రి సుబ్బరాయ మొదలియారి. ఆంగ్లేయభాషలోఁ బ్రవేశము కలవాఁడై పొలములకు నీరు పంపు కాలువలమీఁద నధికారముగల యొక కంపెనీవద్ద నుద్యోగస్థుఁడుగా నుండెను. సుబ్బరాయ మొదలియారి రాజభాషయగు నింగ్లీషు చెప్పించుట వలన గలిగెడు లాభముల నెఱిఁగినవాఁడు కావున బాల్యము నందె మిక్కిలి చాకచక్యము బుద్ధికుశలతఁ గనబడుచున్న తన కుమారున కావిద్యఁ జెప్పింపఁ నారంభించెను. రంగనాథము బాలుడై యుండగాఁ దండ్రికిఁ జెన్నపట్టణమునుండి యవనాషి యను గ్రామమునకు బదిలి యయ్యెను. కాని యాగ్రామమున నతఁడు చిరకాలముండ లేదు. అక్కడ నుండగా నొకనాటిరాత్రి వానియింట బందిపోటు దొంగలు పడిరి. ఆ మొదలియారి ప్రియపుత్రుఁడగు రంగనాథమునకు దొంగలవలన మహాపాయము సంభవించునని భయపడి వాని నటుకమీఁద దాఁచి కూతునుం దీసికొని దొంగల యెదుటికి బోయి యింటనున్న సర్వస్వము వారికి సమర్పించెను. కానిదొంగలు తనివినొందక యింకను నీవు సొత్తు దాఁచితివి. అది చూపవేని నీ ప్రాణములు నీకు దక్కవుసుమీ" యని వానిని బెదిరించిరి. అప్పుడు తండ్రి గడగడవడంకుచు నటుకమీఁద బిడ్డను దాఁచుట తప్ప వేరు సొత్తు దాఁచలేదని చెప్పెను. చోరులు బాలకునిఁ బయి నుండి క్రిందికిఁ దింపిరి. అప్పుడు రంగనాథము తనప్రాణము నిమిత్తము మిక్కిలి దయనీయములగు మాటలతో దొంగలను బ్రతిమాలుకొనెను. దొంగ లెవ్వరికి హానిజేయకుండ నెట్టెటో యిలు వెడలిపోయిరి. సుబ్బరాయ మొదలియారి యుద్యోగము వెంటనే మాని మరునాడే యవనాషి నిడిచి చెన్న పురికిబోయి యక్కడ కాపుర ముండెను.