పుట:Mahaapurushhula-jiivitamulu.pdf/39

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

28

మహాపురుషుల జీవితములు



ప్రార్థనము నిమిత్తము బ్రహ్మసమాజమున కొక మందిరమును నిర్మించి రామచంద్ర విద్యావాగీశుని బ్రధానాచార్యునిగ నేర్పఱిచి పోయెను. రామమోహనుఁడు వెళ్ళినదిమొదలు సమాజము క్రమ క్రమమున క్షీణించినందున విద్యావాగీశుఁ డిఁక సమాజము వృద్ధి పొందదని నిరాశఁజేసుకొనియెను. ఉపనిషత్తుల జదువుటచే దేవేంద్రనాథుని మనస్సు పరిపక్వమయి భక్తిజ్ఞాన వైరాగ్యములతో నిండి నందున నతఁడు పరమేశ్వరుడొక్కఁడే యనియు నతఁడు నిరాకార నిర్వికల్పనిరంజనుండనియు గ్రహించి విగ్రహారాధనము సేయగూఁడదని నిశ్చయించుకొని తనమిత్రులతో నతఁడాసమాజమునఁజేరి తన తత్వబోధినీ సమాజముఁ గూడ నందుఁ గలిపి విద్యా వాగీశున కానందముఁ గలిగించి కొనయూపిరితోనున్న బ్రహ్మసమాజమును బ్రతికించెను. ఇతఁడు చేరుటచేతనే బ్రాహ్మసమాజ మొకగొప్ప మత మయ్యెను. దానికిఁ గావలసిన ధనసహాయమంతయు నతఁడేచేయుచు దానిభారమంతయు నతఁడే వహించుచు సర్వవిధముల దానిని వృద్ధి జేసెను. మఱియు వేదాంతశాస్త్ర వృద్ధికొఱకు తత్వబోధిని పాఠశాల నొకదానిని స్థాపించి దానికిఁగావలసినధనమంతయునితఁడె యిచ్చెను. నాలుగువేదముల నర్థసమేతముగఁ జదువుటకు నలుగురు బ్రాహ్మణ కుమారులను గాశీపురమున కంపెను. బ్రహ్మసమాజములోఁ జేరిన తనమిత్రులలోఁ కొందఱప్పటికిని విగ్రహారాధనము సేయుచుండుటఁ జూచి యది మాన్పింపఁదలఁచి 1843 వ సంవత్సరమునం దాయన సమాజికులందరు ప్రమాణపత్రిక నొకదానిపై వ్రాలు చేయవలయునని తీర్మానించెను. ఆపత్రికపై సంతకములుఁ జేయువారు, తాము సృష్టి స్థితిలయకారణభూతుడఁగు పరాత్పరు నద్వితీయు మానసా రాధనము సేయుటయేగాని విగ్రహారాధనము సేయమనియు రోగ దుఃఖపీడుతు లగునప్పుడుతప్ప ననుదినము భగవంతుని సేవ జేయుదు