పుట:Mahaapurushhula-jiivitamulu.pdf/388

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

తండాళం గోపాలరావు

327

గోపాలరావు తాను చేయఁ దలఁచిన పని సంపూర్ణముగ జేయుటయె గాక యితరులచేతఁ జేయింపవలసి వచ్చినప్పుడుకూడ మిక్కిలి పట్టుదలఁతో జేయించెను. పూనికతో బనిచేయుటయె యాతనివంతుగాని ఫలితములను బహుమానములను ముందు లెక్కజూచుకొనుట వాని పనిగాదు. తన విధికృత్యము దాను చేయుటయె వానికిఁ బ్రథమ కార్యము. ఏపనినైన నెరవేర్చుటలో నతని కతఁడె యాలోచించుకొనునుగాని రెండవవానితో నాలోచింపఁడు. తన చేయఁదలచిన పని న్యాయమని తోఁచెనా యాయన యది జనసమ్మత మైనను గాకపోయినను దానిని నెరవేర్చితీరును.

అతనిమార్గమును దక్షిణహిందూస్థానమందలి విద్యావంతు లందఱు నవలంబింపవలయు" ఆయన జీవితకాలమంతయు నుపాధ్యాయత్వమునందె గడపుటచేత వాని నెఱిఁగినవారందఱు వానిబోధనాశక్తి, సామర్థ్యమును గూర్చియే పలుకుదురు. ఆయనను గూర్చి యాయన శిష్యుఁ డొకఁడు కుంభకోణము నగర మందిరమున నీక్రింది విధమున బలికెను. "ఆతండు సంపూర్ణుడైన యుపాధ్యాయుఁడు. పాఠకపుస్తకమును విద్యార్థులకు బోధించు నప్పుడు పుస్తకములలో నున్న సంగతులనేగాక వాటికి సంబంధించిన విషయములనేకములు దెచ్చి లోకానుభవము గలిగించుచుండును. ఆవిషయము లెవ్వి యనగా నుత్సాహము గలిగించు ప్రాచీనకవిత్వములు జిత్రకథలు మహాత్ములయొక్కయు యోగులయొక్కయు చరిత్రములు అప్పు డప్పు డతఁడు చెన్నపురిరాజధానిలో మహావిద్వాంసులైన సుబ్రహ్మణ్యం అయ్యరు రంగనాథం మొదలియారు మొదలగువారింగూర్చి వారిమార్గము ననుసరించి ప్రవర్తింపుఁడని విద్యార్థులం బురికొలుపు చుండును. పక్షి తనకుఁ బుట్టినపిల్లలు గ్రమక్రమంబున నాకాశము మీఁది కెగురునట్లు చేయుట కెంతశ్రమపడునో యావిధముననే తన