పుట:Mahaapurushhula-jiivitamulu.pdf/374

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

సర్. తిరువఱ్ఱూరు ముత్తుస్వామి అయ్యరు

315



త్తతో విచారణచేసి తీర్పు రెండు మూడు సారులు వ్రాసి చింపివేసి మరల వ్రాసి కోర్టులోఁ జదివెను. చదివినతోడనే యెల్లవారు తీర్పు మిక్కిలి యుక్తి యుక్తముగా నుండినదని శ్లాఘించిరి. అది మొదలుకొని అతనిప్రతిష్ఠ క్రమక్రముముగా హెచ్చెను. హైకోర్టుజడ్జిపదివికెక్కిన స్వదేశస్థులలో నింతవాడు లేఁడని యిప్పటికీ జనులు చెప్పుచున్నారు. ఆయనశాంతము నిష్పక్షపాతము మేనుదాఁచని పరిశ్రమ సత్యమును గ్రహించు సూక్ష్మబుద్ధి విశేషించి ధర్మశాస్త్రజ్ఞానము వానికి శాశ్వతమైన సత్కీర్తిం దెచ్చినవి, విస్తారము బుద్ధిపరిశ్రమగావలసిన చిక్కు వ్యాజ్యము లన్నియు సాధారణముగా నాతనివద్ద కేవిచారణకు వచ్చుచుండెడివి. న్యాయాధిపతియొక్క కృత్యము మిక్కిలి పవిత్రమైనదని యతఁడు నమ్ముచు వచ్చెను. ఆనమ్మికనే యొకసారి కాన్వోకేషను మహాసభలో నతఁడీక్రిందిమాటలతో వక్కాణించెను. "న్యాయస్థానము (హైకోర్టు) పవిత్రమైన దేవాలయము, అక్కడ కూర్చుండు న్యాయాధిపతులు (జడ్జీలు) మనుష్యులైనను సత్యదేవతయొక్క సేవకులు. ఆపవిత్ర దేవాలయమును దురాచారములతోను దుష్కార్యములతోను ప్రవేశించువారు తప్పక యీశ్వరద్రోహులు, మీలో నెవరైన నట్టిపీఠమెక్కి మీరాజుపక్షమున న్యాయము జేయవలసివచ్చినప్పుడు దైవముఖమును జూచి చేయుఁడు".

ఆయనతో సమానముగఁబీఠముమీఁద గూర్చుండిన యూరోపియనుజడ్జీలు వానిని మిక్కిలిగౌరవముతోఁజూచుచు ధర్మశాస్త్రములయందు వానిని మహాధికారిగా భావించిరి. వాని తీర్పులు మిక్కిలి పెద్దవిగానుండిన శాస్త్రాంశములను సమగ్రముగా చెరిగి వేయుచుండును. కోర్టులలో జరుగు వ్యవహారధర్మశాస్త్రముల సంబంధమగు గ్రంథములకు వానితీర్పులు మంచి అలంకారములని చెప్పవచ్చును. ఈప్రకారము స్వదేశస్థులయు దొరలయు మెప్పులుబడయుచు ముత్తుస్వామి అయ్యరు