పుట:Mahaapurushhula-jiivitamulu.pdf/368

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట అచ్చుదిద్దబడ్డది
309
సర్. తిరువఱ్ఱూరు ముత్తుస్వామి అయ్యరుదినదినాభివృద్ధినొంది యేటేట బహుమానములను విద్యార్థి వేతనములను బడయుచువచ్చెను. వానిబుద్ధి గణితశాస్త్రమందు మిక్కిలి ప్రవేశించెను. అందులో జ్యోతిశ్శాస్త్రమునందు వానికి మహాభిమానము. విద్యార్థులకు నుపాధ్యాయులకు నీదినములలో నుండెడి పరస్పర సంబంధముగంటె నాదినములలో సంబంధ మెక్కుడుగనుండెను. ఈకాలమున విద్యార్థులు పాఠశాలలో నున్నంతసేపేకాని యవ్వల నుపాధ్యాయులను దరుచుగ కలిసికొనరు. ఆకాలమున అట్లుకాదు. పవెలుగారు పాఠశాలలో నొడలు దాచుకొనక యెంతో శ్రమపడి బాలురకు విద్యజెప్పుటయేగాక శిష్యుల నింటికి దీసికొనిపోయి వారికి గావలసిన శాస్త్రములు చెప్పుచు వచ్చెను. ముత్తుస్వామి మిక్కిలి చదువు తమకములుగలవాడగుటచే బలుమారు పవెలుగారి యింటికిబోయి రాత్రి తొమ్మిదిగంటలవఱకు జ్యోతిశ్శాస్త్రము మొదలగునవి నేర్చికొనుచు వచ్చెను. చీకటి రాత్రులలో శిష్యుడొక్కడు గృహమునకుఁ బోలేడని పవెలుగారు ముత్తుస్వామిని దనబండిమీఁద నెక్కించుకొని వాని నింటికి తీసుకొనిపోయి దిగవిడుచుచుండును. తన శిష్యుడు ప్రతి నెలకు వ్యయముచేయు సొమ్ము సరిగా వ్యయముచేయుచున్నాడో లేదో యని వాని లెక్కలు సయిత మాదొర నెల నెలకు జూచుచు వచ్చెనట. ముత్తుస్వామి బుద్ధిసూక్ష్మతకుఁ దోడుగ మిక్కిలి పాటుపడుచు వచ్చినందుల నెన్నో బహుమానములఁ బడసెను.

1856 వ సంవత్సరమున విద్యాధికారు లింగ్లీషులో మంచి వ్యాసము వ్రాసిన వానికి నైదువందల రూపాయలు బహుమాన మిచ్చుటకు బ్రతిజ్ఞ చేసిరి. చెన్నపురి రాజధానిలోనున్న విద్యార్థు లందఱు దానికి బ్రయత్నింపవచ్చునని వారు సెలవిచ్చిరి. అప్పు డనేకులు వ్యాసములు వ్రాసిరి. అప్పుడు బహుమానము ముత్తుస్వామికే వచ్చెను. ఆవ్యాసములో వ్రాసినవిషయము 'మనజాతిలోగల దుర్గుణ