పుట:Mahaapurushhula-jiivitamulu.pdf/364

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

[39]

305

సర్. తిరువఱ్ఱూరు ముత్తుస్వామి అయ్యరు

తిరువఱ్ఱూరు ముత్తుస్వామి అయ్యరు గారు తంజావూరు జిల్లాలోని ఉచువడి గ్రామములో 1832 వ సంవత్సరం జనవరి 28 వ తారీఖున నొక బీదబ్రాహ్మణ కుటుంబమున జన్మించెను. ఆతని దురదృష్టముచేతఁ దండ్రియగు వెంకటనారాయణశాస్త్రి స్వల్పకాలములోనే మృతినొందుటచే బాలకుని పెంచు భారమంతయు నిరాధార యగు తల్లిమీఁద బడెను. అప్పటికి ముత్తుస్వామి కొక తమ్ముడు గూడ నుండెను. తల్లి బాలకుల నిరువురిఁ దోడ్కొని తిరువఱ్ఱూరు గ్రామమునకుఁబోయి విద్యాభ్యాసము చేయింపసాగెను. అక్కడ బడిలో బాలకు లిద్దఱు స్వల్పముగ నఱవము నేర్చికొనిరి. ఆ చదువైనఁజాలకాలము చెప్పించుటకుఁదల్లికి శక్తి లేనందున ముత్తుస్వామి కుటుంబపోషణార్థము మిక్కిలి పిన్న వయసుననే యుద్యోగము సంపాదించుకొనవలసివచ్చెను. అందుచేత నతఁడు గ్రామకరణమువద్ద నెలకొక రూపాయ జీతముమీఁద లెక్కలువ్రాయుటకు గుదిరెను. కొడుకు సంపాదించునట్టి యా స్వల్పజీతమునైనఁ దిని బ్రతుకుటకుఁ దల్లికి ప్రాప్తము లేకపోయెను. ఈ చిన్న యుద్యోగమైన స్వల్ప కాలములోనే యామె మృతినొందెను. ఆమె బ్రతికియున్న కాలమున గుమారునకు విద్యమీఁద నధికాసక్తి గలిగించెనఁట. ఆమె చేసిన ప్రోత్సాహము చేతనే తా నంతటివాఁ డయ్యెనని ముత్తుస్వామి యయ్యరు పలుమా రిటీవల చెప్పుచు వచ్చును. ఆ యుద్యోగమున నతఁడు పదునాలుగు వత్సరముల వయసు వచ్చువఱకుండెను. దైవము గొప్పవారు కావలసినవారిని జిరకాలము హీనస్థితిలో నుంచడుగదా!

1846 వ సం|| ముత్తుస్వామి తన తాలూకా తహసీలుదారగు ముత్తుస్వామినాయకన్ననువాని ప్రాపకము గాంచెను. ఈతనికి బట్లరు