పుట:Mahaapurushhula-jiivitamulu.pdf/355

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

298

మహాపురుషుల జీవితములు



కాని సరదారులు వానికిఁ లోఁబడుటకు సామాన్యులు కారు. వారు మహారాష్ట్రులు. భుజబలము టక్కరి తనము గల ప్రవీణులు వారిని లోబరచుకొనుటకు మాధవరావు కొన్ని కొత్త చట్టములఁ జేసెను. కాని వారు లొంగక యిండియా సెక్రటెరి కప్పీలుచేసియుఁ గుట్రలుఁ పన్నియుఁ జాలతొందరకలిగించిరి. అప్పుడు మాధవరావు ధైర్యముఁబూని కొందఱుసరదారులను దేశమునుండి యావలకుఁ బంపి కొందఱిని బెదరించి కొందఱిని బ్రతిమాలి దేశముమంచిస్థితిలోఁ బెట్టి జనుల దురవస్థఁ దొలఁగించెను.

ఈ సంస్థానమం దుండిన సరదారులు మహారాజునెడ నెట్లు నడచుకొనవలయునో సంస్థానమునం దెంతయధికారము గలిగియుండవలయునో మొదటినుండియు సరిగా నేర్పాటు చేయబడలేదు. సరదారులు మహారాజు కోరినప్పుడు యథాశక్తిగా సైన్యమునుగాని ధనమునుగాని సమర్పింప వలయునని యొక విధముగా నేర్పాటు కలదు. విశేషించి వారలేఁటేఁట గొంత శిస్తుఁగూడ నీయవలయును. సంస్థానప్రభుత్వము బలహీనముగా నుండుటఁజేసి యాసరదారులు తామీయవలసిన సొత్తు నీయక జమీనులను స్వేచ్ఛగా ననుభవించుచు నిరంకుశాధికారులై యెవరిమాట వినక సంస్థానమునకు గంటకులైయుండిరి. వారి నడఁపకపోయిన పక్షమున సంస్థానమునకు క్షేమములేదని మాధవరావు తెలిసికొని యాపనిఁ బూనెను. కాని యది సులభసాధ్యము గాదు. వారి భూముల నూడదీసికొనుట యధర్మము, ఊడఁదీసికొనక పోయినచో వారు లోఁబడరు. అందు చేత మాధవరావు పాఁత లెక్కల వెతికించి ప్రతిసరదారు సంస్థానమున కీయవలసిన పాఁతబాకీ నిమ్మని బలవంతముపెట్టెను. అది యిచ్చుకొనలేక కొందఱు తమ భూముల వదలుకొనిరి. కొందఱు తమ జమీనులు సంస్థానమునకే యమ్మిరి. ఎందుకునొడంబడక ప్రతి