పుట:Mahaapurushhula-jiivitamulu.pdf/354

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

[38]

రాజా సర్ మాధవరావు

297

ఆ కాలమున బరోడా సంస్థానస్థితి మిక్కిలి శోచనీయమై భయంకరమై యుండెను. ద్రోపుడు ద్రోహము నరహత్య రాజ్యమందెల్ల చోటుల నిరంతరాయముగ గానంబడుచువచ్చెను. ఉద్యోగస్థులు పరస్పర మత్సరముచేత నొండొరుల నాశనము చేయదలఁచికుట్రలు పై గుట్రలుపన్ని సంస్థానమునకుఁ జాలనష్టములుఁ గలుగఁ జేయుచుండిరి. వారి నడఁచుటకు, సంస్థానము జక్కఁజేయుటకు మంచి యినుప మనస్సు, యినుపచేయిగల మనుష్యుడు గావలయు. అట్టివాఁడు మాధవరావుగాక యన్యుఁడు లేఁడు. అక్కఁడ యింగ్లీషు రెసిడెంటు మాధవరావునకు సమస్త విషయముల సహాయము చేసి వాని పూనిక గడముట్టించెను. మాధవరావు దాఁటవలసిన మొదటి కష్టసముద్రము బరోడాసంస్థానపు శిస్తు వ్యవహారము. బరోడా దొరతనమువారు శిస్తు వసూలు నిమిత్తము గ్రామములను సరదారు లనఁబడు కొందఱు జమీందారుల కమరకము చేయుచు వచ్చిరి. ఆసరదారులు స్వయముగ వ్యవహరింపక కొందఱు షాహుకార్లకు గ్రామములను దిరిగి యమరకము జేయుచువచ్చిరి. ఆషాహుకారులు దయదాక్షిణ్యము లేక పంటలుపండిన యేడనక పండని యేడనక ధనము స్వీకరించుటయే ప్రధానవృత్తి చేసికొని కత్తులు కఠారులుఁ బుచ్చుకొని ప్రజలపైబడి శిస్తులీయని వారినిఁ దిట్టి కొట్టి చంపి సొమ్ము దోచుకొనుచు వచ్చిరి. పన్నులు పోఁగుచేయు నెపమున షాహుకారులు దేశమున నరహత్యలు ద్రోపుడులు యధేచ్ఛముగ గావింపుచు వచ్చిరి. సరదారులు సొమ్మే కావలసినవారగుటచే నీ దుష్కార్యములఁ జూచియుఁ జూడనట్లుండిరి. మహారాజు మంత్రులు సరదారులు జోలికిఁ బోయినచో శిస్తు కొంచమైనఁ జేఁ జిక్కదని భయపడి యూరకుండ వలసిన వారైరి. ఆస్థితినిఁజూచి మాధవరావు