పుట:Mahaapurushhula-jiivitamulu.pdf/353

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

296

మహాపురుషుల జీవితములు



వ్రాసి ప్రకటించెను. అందు మాధవరావు సహజముగా గట్టి దార్ఢ్యము కలవాఁడనియు నిప్పటికి నలువదియైదేండ్ల వయసు నుండుటచే మరి పదియేండ్లు పని చేయఁగలడనియు సంస్థాన వ్యవహారముల యందతనికిఁ గల నేర్పసమానమనియు స్పష్టముగాఁ దెలుపఁబడెను. ఆ సమయముననే యిండియా సెక్రటరి మాధవరావునకుఁ దగు నుద్యోగము నీయవలసినదని గవర్నరు జనరలునకు వ్రాసె. దాని కనుగుణముగా నిందూరు సంస్థానప్రభువగు తుకాజిరావు హోల్కారు తన సంస్థానమునకు మంచిమంత్రిని బంపవలయునని గవర్నరు జనరలును గోరెను. ఆ యుద్యోగ మంగీకరింపుమని గవర్నరు జనరలు మాధవరావును గోర నతఁ డందుకు సమ్మతించి 1873 వ సంవత్సరమున నిందూరులో మంత్రి పదస్థుఁడయ్యె. ఇందూరులో మాధవరావు రెండుసంవత్సరములే యుండుట కొప్పుకొని పనిఁ బూనెను. ఆ కాలమున నతఁడు చేసిన గొప్పకార్యము లంతగాలేవు. ఇందూరు సంస్థానమున కదివఱకు శిక్షాస్మృతి లేదు. అది మాధవరావు చేయ నారంభించెను. ఈయన జ్ఞాతియగు దివాను బహదరు రఘునాధరావు తరువాత నిందూరు మంత్రియై యా పుస్తకము పూర్తి చేసెను. రెండు సంవత్సరముల గడువు కాఁగానే మాధవరావు మంత్రిపదమును మాని పోవఁదలఁప హోల్కారు మఱియొక యేఁడుతుండవలయునని వానిని బ్రార్థించెను. ఆ ప్రార్థన మంగీకరించి యతఁ డక్కడ నుండ 1878 వ సంవత్సరమున బరోడా సంస్థానాధిపతి యగు మునహరరావు గైక్వారు రెసిడెంటునకు విషము పెట్టఁదలఁచినాడను నేరము మీఁద గవర్నరు జనరలు వానిని సింహాసన భ్రష్టునిఁ జేసి యుక్తవయస్కుఁడు కాని యాతని కుమారునకు రాజ్యమిచ్చి యా సంస్థానమునకు మాధవరావును మంత్రిగా యువరాజునకు సంరక్షకునిగ నేర్పరచెను.