పుట:Mahaapurushhula-jiivitamulu.pdf/35

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది
24
మహాపురుషుల జీవితములు


క్షేత్రములకుఁ దనతోఁగూడఁ దీసికొనిపోయి తిప్పెను. ఇతఁడు తన పితృసఖుఁ డగు రామమోహనునిచే స్థాపింపఁబడిన హిందూకళాశాలలో విద్య నభ్యసించెను. బుద్ధిసూక్ష్మత కలవాఁ డగుటచే బాల్యమునందే యీతఁడు సంస్కృతము, పారసీ, యింగ్లీషు, బంగాళీ భాషల నేర్చుకొని వానిలోఁ బ్రవీణుఁ డయ్యెను.

చిన్ననాఁటనుండియు నితని కుపనిషత్తులపై నెంతయు నిష్టము. అదియునుగాక బ్రహ్మసమాజస్థాపకుఁడగు రామమోహనునియింటికి దఱచుగఁ బోవుచుండుటచే నేకేశ్వరారాధనవిషయములను ప్రసంగములవినుచువచ్చెను. ఆగర్భశ్త్రీమంతుఁ డగుటచే దేవేంద్రనాథుఁడు మహావైభవముల ననుభవించుచుఁ బెరిగెను. తన బాల్యమును గురించి యతఁడే యొకచోట నిట్లు వ్రాసియున్నాఁడు.

"సంపన్నులగు తల్లిదండ్రులకుం బుట్టి రాజఠీవి గల కుటుంబమున మహావైభవముతోఁ బెరుగుటంజేసి చిన్ననాట నేనెన్నఁడు భగవంతుని పేరయినఁ దలపెట్టనైతి. ప్రపంచమునందఱు నన్ను గౌరవించువారె. అందఱు నాకు సదుపాయములను జేయువారె. పిలుచుటయె తడవుగ లెక్కకుమీఱిన సేవకులు నాయెదుటఁ జేతులు కట్టుకొని నిలిచెడివారు. ద్రవ్యమన్ననో నేఁ గోరిన నిముసముననె యెడలేని సముద్రతరంగములవలె వచ్చి నాచేతులం బడుచుం డెడిది. నేనడుగుటె యాలస్యముగ నాకోరిక లెల్లఁ దీరుచువచ్చినవి. సౌఖ్య సంపదలు నన్నా దినములలో భ్రమపెట్ట నే నేమియు నెఱుఁగక మోహసముద్రమునం బడితిని. తాత్కాలికములగు సౌఖ్యములనేఁ జూచుకొంటిఁగాని నేను పరలోకమును భవిష్యత్తును దలఁపనైతిని. నేను ప్రపంచసంబంధము లగు మాయలయందుఁ దగుల్కొని యింద్రియ సుఖలోలుఁడనై నాయంతరాత్మను లెక్క సేయక భోగపరాయణ మయిన మనస్సెట్లు త్రిప్పిన నట్లు తిరిగితిని." ఈశ్వరానుగ్రహమున నీయవస్థ చిరకాల ముండదయ్యె.