పుట:Mahaapurushhula-jiivitamulu.pdf/343

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

288

మహాపురుషుల జీవితములు



ప్రకృతి వినోదములకు గాని బేరువడసిన గ్రామముల పేర్లు జ్ఞాపకార్థము తనపుస్తకములో వ్రాసికొని యాయా గ్రామములందు కళావిశారదులగు బుద్ధిమంతులు గానఁబడినప్పుడు వారి కేవోపనులు గల్పించి ధనసహాయము జేయుచుండును. చేతిపనులకుఁ దగిన ప్రోత్సాహముఁ గలుగఁజేయుట కాయన యాపనులునేర్పుపాఠశాల నొకటి స్థాపించెను. అతని ప్రోత్సాహము జేతనే క్విలనుపట్టణమందు వస్త్రములునేయుయంత్రములు స్థాపింపఁబడెను. అతనిప్రోత్సాహము చేతనే పూనలూరు గ్రామమున కాగితములుచేయు యంత్రములు స్థాపించుటకుప్రయత్నము గలిగెను. ప్రకృతిశాస్త్రమునం దతనికిగల యభిరుచి నానాటికి హెచ్చ తన రాజధానిలోనున్న కలాశాలలో రసవాదశాస్త్రము (కెమిస్ట్రీ) ప్రకృతిశాస్త్రము నేర్పింపఁ దలఁచి యుపాధ్యాయుల నేర్పఱచెను. అతని శాస్త్ర పరిశ్రమలను బట్టి యూరపుఖండములో నింగ్లాండు మొదలగు దేశములలోనున్న ప్రకృతిశాస్త్రీయసంఘము లనేకములు వానిని సభ్యునిగ జేర్చుకొనియెను. సంస్కృతపాండిత్యమునుబట్టి రాయల్ ఏష్యాటిక్కుసంఘము వారు వానినిఁ దమసంఘములో జేర్చుకొనిరి. భూగోళశాస్త్రపరిజ్ఞానమునుబట్టి భూగోళశాస్త్రీయ సంఘమువారు జేర్చుకొనిరి. ఇట్లతని కీర్తి స్వేదేశమందెగాక దేశాంతరములయందు ద్వీపాంతరముల యందు ఖండాంతరములయందుగూడ వ్యాపించెను. ఈసంఘములవా రందఱు వాని నట్లు గౌరవింపకమునుపే శ్రీవిక్టోరియాచక్రవర్తినిగారు వారికి "సర్. కె. సి. యస్. ఐ." యను బిరుదమునిచ్చిరి. ఈ విదేశపు బిరుదులకుఁ దోడుగ నతఁడుస్వదేశపు బిరుదులఁగూడ గొన్నిఁటి నందెను. అతని పూర్వులందఱు తులాభారముఁదూగి కుల శేఖర పెరుమాళ్ళను బిరుదమును వహించుచువచ్చిరి. ఆవిధముగానే రామవర్మయు నాబిరుద మందెను. అనంతరము కీర్తిపతి యను బిరుదము