పుట:Mahaapurushhula-jiivitamulu.pdf/341

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

286

మహాపురుషుల జీవితములు



ముందే మేల్కొని బండి షికారుపోయి తిరిగివచ్చునప్పుడు మధ్య మార్గమున నుదయభానునిం గలిసికొనును. షికారుముగించి యతఁడు గృహమునకుఁబోయి స్నానము, సంధ్యావందనము జపము మొదలగు పారలౌకికకృత్యములు నెర వేర్చుకొని భోజనముచేసి ప్రతిదినము పదునొకండు గంటలకు రాచకార్యముల నిమిత్తము దర్బారునకుఁబోవును.

అది మొదలు రెండుగంటలువఱకు మందిర వ్యవహారములు దేవస్థాన వ్యవహారములు కనుఁగొని చక్కఁజేసి తక్కిన వ్యవహారములలో లేశ లేశములుగూడ పరిశీలించుచుండును. అనంతరము కాఫీత్రాగుటకుఁ బోవును. రెండుగంటలు మొదలుకొని యుద్యోగస్థులు వ్రాసిపంపు రిపోర్టులు చదువుకొనును. కోరినవారికి దరిశన మిచ్చును. సాయంకాల మైనతోడనే మరల నతఁడు సంధ్యావందనము మొదలగు కాలకృత్యములను దీర్చుకొనును. దేహారోగ్యము సరిగా నుండనప్పుడు సయితమతఁడు సంధ్యావందనాదికములు భక్తిశ్రద్ధలతోఁ జేయుచుండును.

గవర్నరులు తన దేశము వచ్చినపుడు దేవతోత్సవము లైనప్పుడు విందులు జరిగినప్పుడు సయితము రామవర్మ రాజ్య కార్యముల నిమిత్తము తా నేర్పరచుకొన్న కాలము వానిక్రింద వృధసేయక తన విశ్రాంతినిమిత్త మేర్పడిన కాలమునందే తత్కార్యములు నెరవేర్చు చుండును.

రామవర్మ యిరువది యైదేండ్ల ప్రాయము మొదలు మరణ పర్యంతము దిన చర్య వ్రాయుచు వచ్చెను. ఎంత ప్రొద్దుపోయినను పండుకొనుటకుఁ బోవక మున్నతఁడు దినచర్య వ్రాసితీరును. ఇన్ని పనుల నడుమ రామవర్మ యింగ్లీషుగ్రంథము లనేకములు చదువుటకును యింగ్లీషుతో నెన్నో యుపన్యాసములు వ్రాయుటకును దీరిక గలవాఁ డయ్యెను. తన సంస్థాన మందున్న పాఠశాలలోఁ జదువు