పుట:Mahaapurushhula-jiivitamulu.pdf/332

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

మహారాజా సర్ రామవర్మ

277



రామవర్మ రోగపీడితుఁడై నందున చదువు సరిగా జరుగలేదు. కాని చదివినపుడెల్ల నతఁడు మిక్కిలి పూనికతోఁ బనిచేయుచువచ్చెను. ఏపనియయిన సగము సగము చేయుట వానికిఁ జిన్ననాటనుండియుఁ గిట్టదు. తండ్రిశిక్షలో నుండుటచే నీగుణమువానికి మఱింత వృద్ధి నొందెను. అట్లు కఠినమైన పితృశిక్షలో నుండుటచేత వానియందు స్వతంత్రబుద్ధి వర్థిల్లెను. ఈస్వాతంత్ర్యము సత్కార్యములు గావించు వారియెడల వినయమై యకార్యములు గావించువారియెడల యవినయమై నానాట వృద్ధినొందెను.

1849 సంవత్సరమందు వానియందు క్షయరోగ చిహ్నము లంకురించెను. ఆరోగబలముచే నతని శరీరము కృశించినను మనోదార్ఢ్య మంతకంత కతిశయించెను. ఆరోగము కొంచెముపశమించిన పిదప రామవర్మకుఁ దగిన యుపాధ్యాయు నేర్పరుపఁతలంచి తిరువాన్కూరు మహారాజు మంచియొజ్జను బంపుమని చెన్నపట్టణపు దొరతనమువారికి వ్రాసెను. ఆదొరతనమువారు శ్రీమాధవరావుగారిని బంపిరి. ఈయనయే రాజా మాధవరావను బిరుదమునొంది బరోడా సంస్థానమునకు మంత్రియైన ఘనుఁడు. ఈమాధవరావుగారితండ్రియుఁ బినతండ్రియుఁగూడ తిరువాన్కూరులో బూర్వము మంత్రులై యుండుటచేతను మాధవ రావా కాలపు విద్యావంతులలోఁ బ్రథమగణ్యుఁ డగుటచేతను తిరువాన్కూరు యువరాజున కుపాధ్యాయుఁ డగుట కతఁడే తగినవాఁడని దొరతనమువా రంపిరి. 1849 వ సంవత్సరమున మాధవరావు రామవర్మ కొజ్జగా నియమింపఁబడి శిష్యునకు నాలుగేండ్లు విద్యఁగఱపెను. మాధవరావు శిష్యున కింగ్లీషులోని సాహిత్య గ్రంథములు మనోవికాసముఁ గలిగించు ప్రకృతిశాస్త్ర సంగ్రహములు నేర్పెను. రామవర్మ విషయమున గురువు చేసిన శ్రద్ధకుఁ దోడుగఁ దండ్రియుఁ జాల శ్రద్ధచేసి విద్యాబీజములు