పుట:Mahaapurushhula-jiivitamulu.pdf/319

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

266

మహాపురుషుల జీవితములు



గారు వానినిజూచి లేచి చేతులుచాచి కౌఁగిలించుకొని "రంగనాథా నాకు మాట దక్కించితివి నేను ధన్యుఁడనైతి నిన్ను దేవుడు రక్షించుగాక!" యని బహూకరించెను.

ఏపనిలో బ్రవేశించుట బాగుండునని పిమ్మట వారిద్దఱు యోచించిరి. రంగనాథున కుపాధ్యాయుడుగ నుండవలయునని కోరికకలదు. అందుచేత జడ్జీగారు పవెల్‌దొరగారు చెన్నపురిలో లాయరుగానుండిన నార్టను దొరగారు రంగనాథున కాయుద్యోగ మీయవలసినదని దొరతనమువారికి సిఫారసుచేసిరి. ఎవరెంత ప్రయత్నము చేసినను వాని కాయుద్యోగము దొరకలేదు. అంతలోఁ దండ్రికిఁ బ్రాణముమీదికి వచ్చినదని వర్తమానము తెలియ రంగనాథుఁడు చిత్తూరు పోవలసి వచ్చెను. పోవునప్పు డతఁడు జడ్జినిజూచి వార్థకమునందు తండ్రిం గని పెట్టుకొని యుండుటకు వీలగునట్లు చిత్తూరులో నేదయిన యుద్యోగ మిప్పింపుమని యడిగెను. ఆదొరగారు రంగనాథు డేమడిగిన నదిచేయుటకు సిద్ధముగ నున్నందున వెంటనే చిత్తూరు కలక్టరు కొక జాబు వ్రాసి యిచ్చెను. ఆజాబు కలక్టరు చూచుకొన్న కొన్నినాళ్ళలోనే రంగనాథునకుఁ జిత్తూరు సబ్‌కోర్టులో నెలకు డెబ్బది రూపాయలు జీతముగల హెడ్డుగుమస్తాపని యయ్యెను. ఆపనిలో నుండగ నతనికి నెంతోతీరిక గలిగినందువలన గాలమువృధాసేయక యతఁడుజ్ఞాననిధిని వృద్ధిపరచుకొనఁ దలఁచి తెలుఁగు కన్నడము హిందూస్తానీ పారసీ భాషలఁ జదువ నారంభించెను. ఆభాషలలోనున్న కోర్టు కాగితము లన్నియు నతఁడే స్వయముగ నింగ్లీషులోనికి మార్చుచు వచ్చెను. ఆయఖండ శక్తిఁజూచి పై యధికారులందరు విస్మితులగుచువచ్చిరి.

అతనికి చెన్నపట్టణమందు హైకోర్టులో నుద్యోగము చేయవలయునని మహాభిలాష యుండెను. దానికిఁదోడుగ వానితండ్రియు మృతినొందుటచే నతఁడు చిత్తూరు విడువఁదలఁచి యదను వెదకు