పుట:Mahaapurushhula-jiivitamulu.pdf/315

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట అచ్చుదిద్దబడ్డది
262
మహాపురుషుల జీవితములుమునకుబోయెను. పోయి జిల్లాజడ్జిగారి దర్శనముచేసి తనవచ్చిన పని మనవిచేసి తండ్రిని విడిపింపుమని ప్రార్థించెను. ఆమనుష్యుని మరల దీసికొనివచ్చి యప్పగించుటకు దగినవారు జామీనుగానున్న పక్షమున చెఱనుండి విడువనగుననియు లేనిదే వలనుపడదనియు జడ్జి బాలకునితోఁ జెప్పెను. అప్పుడు రంగనాథుఁడు జడ్జితో "నేను తప్ప జామీనిచ్చువా రెవరులేరు. మాతండ్రి యాబ్దీకము బెట్టి మరల వచ్చువరకు వానిబదులు నేనాచెఱసాలలోఁ గూర్చుండెద"నని ప్రత్యుత్తరముగ బలికెను. పండ్రెండేండ్ల బాలుని నోటనుండి వచ్చిన యా సాహసపుఁ బలుకులు జడ్జి మనస్సును వెంటనేకరఁగించెను. తత్క్షణమే ఆజడ్జీ వానితండ్రిని జెరనుండి విడువవలసినదని యుత్తరువు జేసి రంగనాథునిఁగూడ తండ్రితో నప్పటికిఁ బొమ్మనిజెప్పి, మఱునా డొకసారి తనకు గనఁబడుమని యానతిచ్చెను. తండ్రిని విడువవలసినదని జడ్జీ వ్రాసిన యుత్తరవు రంగనాథుఁడే స్వయముగ కారాగృహాధికారుల యొద్దకుఁ దీసికొనిపోయి తండ్రిని విడిపించుకొని రాత్రి ప్రొద్దుపోవునప్పటి కిల్లుచేరెను. తలవని తలంపుగ భర్తబందెనుండి విముక్తుఁడై వచ్చుటఁ జూచి యాయిల్లాలు మిక్కిలి యక్కజపడి వానివిడుదలకు దన చిన్నబిడ్డఁడే ముఖ్యకారకుఁడని విని పట్టరాని యానందము నొంది బాలుని పలుమారు ముద్దుపెట్టుకొని మెచ్చుకొనెను. ఆనాటి రాత్రి తల్లిదండ్రులు తనకుఁజేసిన గారామును తనయెడఁ జూపిన యాదరమును రంగనాథశాస్త్రి పెద్దయైన పిదపఁ గూడఁ దలంచి మిత్రులతోఁ జెప్పి సంతసించుచు వచ్చెను. మఱునాఁ డుదయమున రంగనాథుఁడు దొరగారి యాజ్ఞ మరువక చిత్తూరునకు, బోయి వేళ మీరకుండ జడ్జీ దరిశనము చేసెను. ఆదొర వానినెంతయు గౌరవముతో నాదరించి సంసారస్థితి నడిగి "కర్చులన్నియు నేనే పెట్టుకొని యింగ్లీషు చెప్పించినచో నీవు చదువుకొందువా" యని యడిగెను.