పుట:Mahaapurushhula-jiivitamulu.pdf/292

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట అచ్చుదిద్దబడ్డది
[31]
241
సర్ సయ్యద్ మహమ్మదుఖానువానికి బహుమాన మిచ్చిరి. ఆ పతకముమీఁద నిట్లు వ్రాయఁబడి యున్నది. "తన స్వదేశస్థులలో ప్రకృతి శాస్త్రాదివిద్యలు వ్యాపింపఁ జేయుటకుఁబడిన పరిశ్రమమునకు సంతసించి సర్ సయ్యదు అహమ్మదుఖానునకు గవర్నరు జనరలు బహుమానము చేసిన పతకము."

ఇట్లు దొరతనమువారు తగిన ప్రోత్సాహము నిచ్చుటచే నతఁడు మునుపటికంటె కార్యలోలుఁడై విదేశముల యందలి పద్ధతులు జాడఁదలచి 1869 వ సంవత్సరమున నింగ్లాండునకుఁబోయెను. అతనికి లండను పట్టణమునం దున్నప్పుడె సి. యస్. ఒ. యను బిరుదము వచ్చెను. మరియు నింగ్లాండు దొరతనమువారు వాని యందుఁ బ్రీతిగలిగి సంవత్సరమునకు మూడువేల రూపాయల చొప్పున రెండేండ్లు బహుమాన మిచ్చిరి. అతడక్కడ నుండగనే యతఁడు స్వమతగురువగు మహమ్మదువారి చరిత్రమును మఱికొన్ని యితర గ్రంథములను వ్రాసి ప్రకటించెను. ఆదేశమును స్వయముగ జూచుటచేత నతని కింగ్లీషువారి మీఁదను వారి విద్యాశాలలు మొదలయిన వానియందును మిక్కిలి మంచి యభిప్రాయము గలిగెను. లండను పట్టణమునుండి యతఁడు హిందూదేశములోనున్న యొక మిత్రునిపేర వ్రాసిన యీక్రింది జాబునుబట్టి వాని కింగ్లీషువారియెడ గల గౌరవము తేటపడును. "హిందూదేశములోనున్న మనము జ్ఞానము లేని పశువులమని యింగ్లీషువా రనుకొనుటకుఁ గారణము లున్నవి. ఈవిధముగా నేను వ్రాయుటకు మనవద్దనున్న విశేషలోపము లేవి వారివద్దనున్న యనంత సద్గుణము లేవి యని సందేహించి నామీఁద మీరుకోపము వహింపవచ్చును. వచ్చిననేమి? నేను చెప్పునది నిజము. ఇక్కడనున్న దంతయు మనవారు తలంచుటకైన నూహించుటకైన సమర్థులుగారు. నేను ప్రతిదినము చూచునది నిశ్చయముగ నూహించుటకైన హిందూదేశస్థుల తరముగాదు.