పుట:Mahaapurushhula-jiivitamulu.pdf/283

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట అచ్చుదిద్దబడ్డది
234
మహాపురుషుల జీవితములుఅతఁడుగావించిన సత్పరిపాలనము నొక్క దానిబట్టియే వాని సామర్థ్యమును మనమెంచకూడదు. అతనికున్న విరోధులంబట్టియు వారినిగ్రహ మందతఁడు చూపిన నేర్పుంబట్టియుఁగూడ జూడవలెను. అతనివిరోధులమాట యటుండనిండు. అతఁడు చేసిన ప్రతికార్యమందు వాని ప్రభువగు నిజాము సయితము చెప్పుడుమాటలు విని యెన్నో విఘ్నములు కల్పించుచు వచ్చెను. పాపము సలారిజంగు తను కావించిన పనినిఁ దనియేలిక యెన్నఁడైన మెచ్చుకొనునేమోయని యూటలూరుచు వచ్చె ఎప్పుడో కాని నవాబు మెచ్చుకొనుట లేదు. అతఁడు సంపూర్ణుఁడైన యోగ్యుఁడు. అంతటి యోగ్యుఁడైనను సంస్థాన మంత బాగుచేసినను వెనుకటి నిజాము వానినెప్పుడు సరిగా నమ్మక యేదో యనుమానముతోనే జూచుచువచ్చెను. కోటదాటియావలకుఁ బోవలసివచ్చినప్పుడు నూరుబైటనున్న వసంతగృహమునందు దొరలకు విందుచేయఁదలఁచుకొన్నపుడు సయితము సలారుజంగు నిజాముగారి సెలవును పొందవలయునట. అట్టి సమయములందు నిజాము సెల విచ్చవిచ్చినపుడిచ్చి యిష్టములేనప్పు డియ్యకపోయెను. రెసిడెంటుతో బలుమారు కలుసుకొన్నను నిజామున కనుమానమే. రెసిడెంటు మిక్కిలి యవసరములైన కాగితములు పెట్టెలోవేసి పంపినను నిజామునకు సందేహమే వేయేల తన రెసిడెంటు తన మంత్రి కలుసుకొనుట నిజామున కిష్టములేదు. దన యేలిక యిన్ని చేసినను సలారుజంగు స్వామిభక్తి మెండుగఁ గలవాఁడగుటచేఁ దనకష్టముల నొకరితో జెప్పుకొనఁడు సరిగదా యెన్నఁడు సణుగుకొననైనలేదు. వెనుకటి నిజాము వానిం దరుచుగా సమక్షమునకుఁ బిలుచుటయే లేదు. ఎప్పుడైనఁ బిలిచెనా సలారుజంగు వానికడ నున్నంతసేపేమి మూడునో యని వెలవెలబోవుచునేయుండును. అయినను తన రాజు విషయమున నతఁడు శక్తివంచన లేక పాటుపడుచువచ్చెను. 1867 వ