పుట:Mahaapurushhula-jiivitamulu.pdf/277

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

228

మహాపురుషుల జీవితములు



ద్యోగములు భూములు పోయిన యరబ్బుల హక్కుల విచారించి న్యాయమిచ్చిట కతఁడొక కోర్టుగట్టించెను. మఱియు నరబ్బులకున్న జాగీరులు ముఖాసాలు జమీందారీలు లాగుకొనుటకు నిశ్చయించుకొనెను. ఈవిధమునఁ గృతనిశ్చయుఁడై సలారుజంగు తాను మంత్రి పదమునుబూనిన సంవత్సరములోనే రెండువేల యరబ్బులను రెండువేల పఠానులను మఱియందరి యితర సేవకులను గొలువునుండి తొలఁగించి యేడాదికి నలువదిలక్షల రూపాయలు శిస్తువచ్చు జాగీరులను సంస్థానమునకు గలిపెను. పూర్వ మాసంస్థానములో గుత్తదారీపద్ధతి ప్రకారము శిస్తు వసూలుచేయఁబడుచు వచ్చెను. అనగా తాలూకాదారు ప్రతిగ్రామము నొక్కక్కనికి శిస్తునిమిత్త మిజారాకిచ్చుట. ఈపద్ధతివలన గుత్తదారులు పన్ను లెక్కువ కట్టుటయు రయితు లవి యిచ్చుకొనలేక బాధపడుటయు సంభవించెను. సలారుజంగు దాని నివారింపఁదలఁచి నమ్మఁదగిన మనుష్యులను శిస్తువసూలుచేయ నియమించి గుత్తదారీపద్దతి తగ్గించెను. తాలూకాదారు లదివఱకు రయితులవద్ద వసూలుచేసి శిస్తులో నాలుగవవంతు మూడవవంతు నొకప్పుడు సగము హరించుచువచ్చిరి. క్రొత్తమంత్రియట్టిద్రోహులను నిజోద్యోగములనుండి తప్పించెను. అదివరకు సంస్థానములోఁ బ్రబలియుండిన దొంగతనము బందిపోటు మొదలగు దౌర్జన్యములను మహాకఠినుఁడై యడంచెను. సమర్థమైన యా పరిపాలనముచేత 1856 వ సంవత్సరమునాఁటికి సంస్థానమునకు భూమివలన వచ్చు శిస్తు హెచ్చెను. గొప్పఖజానా యొకఁటి స్థాపింపఁబడెను. హైదరాబాదు సర్కారువారియందు బ్రజలకు గౌరవమతిశయించెను. సంస్థాన మంతటను మంచిమార్పులు పొడసూపెను.

1858 వ సంవత్సరమున నింగ్లీషుదొరతనమువారిమీఁద సిపాయిలు పితూరీచేసిరి. ఇదియే నానాసాహెబుపితూరి యనికూడ చెప్పు