పుట:Mahaapurushhula-jiivitamulu.pdf/271

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

224

మహాపురుషుల జీవితములు



వానిచేత నుపదేశము పొందని ఘనపురుషులు లేరఁట. అతనికి దేశ చరిత్రములయందు మిక్కిలి యభిరుచి. కడసారి యతఁడు చదివిన పుస్తకముగూడ నొకదేశచరిత్రయే. స్వదేశపువ్యాపారములు వృద్ధి పొందుటయు శిల్పవిద్యాదులు మనవారునేర్చుకొనుటయు నున్నప్పుడే మన దేశము బాగుపడునని యాయన తలంచెను. మహారాష్ట్ర బలోదయమనుపేర రెనడీ యింగ్లీషులో నొకచరిత్రము వ్రాసెను. అందు బ్రథమభాగము మాత్రమే ముగిసినది. రెండవభాగము ముగియక మునుపే మృత్యుదేవతయొక్క క్రూరహస్తము వాని నెత్తుకొని పోయెను. ఆ గ్రంథము ముగిసిన పక్షమున హిందువుల కెంతయో లాభము కలిగియుండును. హిందువులు మిక్కిలి దురదృష్టవంతులగుట చేతనే యాయుదారశీలుఁ డంతత్వరలోఁ జనిపోవుటయు నట్టియుగ్ద్రంథము ముగియకపోవుటయు సంభవించెను. అతని యుద్యోగముకన్న పాండిత్యముకన్న వానిసద్గుణములే జనుల కతనియం దనురాగమును బెంచినవి. మహాధికారియయ్యు నతఁడందఱికి నొదిగి యుండును. మహాపండితుఁడయ్యు శిష్యుఁడట్లు వినయమున నేర్చుకొనఁజూచును. పరులమనస్సులు నొవ్వకుండ తన యభిప్రాయమును జెప్పుచుండును. ఈతఁడు రామమోహనరాయలు, విద్యాసాగరుఁడు దేవేంద్రనాథ టాగూరు, కేశవచంద్రసేనుఁడు, ఆనందమోహనభోసు మొదలగు మహానీయులవలె మతాది సంస్కారములలోఁ గార్యసూరుఁడుగా నుండలేకపోయినను మనసులో సంస్కారమన్న మిక్కిలి యిష్టము గలవాఁడు. ఈయన చరిత్రము హిందూదేశస్థులు చిరకాలము జ్ఞాపక ముంచుకో దగినది.