పుట:Mahaapurushhula-jiivitamulu.pdf/27

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది
18
మహాపురుషుల జీవితములుసంఘసంస్కారులు కొందరివలె గాక యాపండితుఁడు తనపూనిన పనియందు నిజమయిన యభిమానము గలవాఁడగుటచే దనకుమారున కొక వితంతుబాలికను వివాహముచేసి చెప్పెడు మాటలకును జేసెడు చేతలకును వైరుధ్యము లేదని జగంబునకు వెల్లడిచేసెను. ఈ తెఱంగున పునఃపరిణయంబునఁ గృతకృత్యుఁడై యంతతోఁ దనివి నొందక విద్యాసాగరుఁడు కులీనపద్ధతి యను దురాచారముపై ధ్వజమెత్తి దానిని నిర్మూలించుటకు, బాటుపడెను. ఆదేశమున నగ్ర గణ్యులు కులీన బ్రాహ్మణు లగుటచే వారిలోనొక్కొకఁడు నలువది యాబది యాడువాండ్రను బెండ్లియాడి యేభార్యతండ్రి యెక్కుడు కట్నములు కానుకలు నిచ్చునో యాభార్య నాదరించుచు తక్కిన వారల నిరాకరించుచు పడఁతులను బలువెతలపాలు సేయుచుండును. విద్యాసాగరుఁడు నోరులేని యంగనల పక్షముబూని యనేక సభలు చేసి కొట్టకొన కా దురాచారము నిర్మూలింప నొకచట్టము నిర్మింపడని దొరతనము వారికి వేనవేలు జనులచేత వ్రాళ్ళు చేయించి మహజర్ల నంపించెను. కాని వితంతువివాహ విషయమునందువలె నతడీఁ కార్యమందు సఫలమనోరథుఁడు కాడయ్యెను. హిందువులు వేదశాస్త్రములు తమకుం బ్రమాణములని వాదములు సలుపుటచే స్త్రీ పునర్వివాహాదికార్యము లకార్యములుగావని యా గ్రంథములయందుఁ బ్రమాణవచనములు జూపినచో నంద ఱొప్పుకొందురని విద్యాసాగరుఁడు కొంతకాలము నమ్మియుండెను. కాని శాస్త్రప్రమాణములు జూపిన వెనుక సయితము హిందువులు పునర్వివాహాదుల నిరాకరించి నప్పుడు నిజముగా హిందువులకు వేదశాస్త్రములయందు నమ్మకము లేదని యాతఁ డిటీవల నిశ్చయించుకొనెను. బాలికలకుఁ గడుచిన్న తనమందే వివాహములు సేయుట దురాచారమని యాతని యభిప్రాయము. నమ్మినట్టు నడచుకొనునట్టి యంతఃకరణశుద్ధుఁ డగు