పుట:Mahaapurushhula-jiivitamulu.pdf/259

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

214

మహాపురుషుల జీవితములు



సన్మానించిరి. రిప్పన్ ప్రభువుగారి తరువాత వచ్చిన ఢఫ్రిన్ ప్రభువు గారును వానికి శాసననిర్మాణ సభలో సభికత్వమిచ్చి గౌరవించిరి. అతఁడు సభికుఁడుగా నున్న కాలమున వచ్చు బడిపన్ను కట్టుట మొదలగు కార్యము లనేకములు జరిగెను. అట్టి పన్నులు కట్టఁగూడదని యతఁడు శక్తివంచన లేక దొరతనమువారితోఁ బోరాడెను. దేహారోగ్యము సరిగా నుండకపోవుటచే నతఁడు 1887 వ సంవత్సరమున దన సభికత్వము మానుకొనెను. కలకత్తానుండి యతఁడు వచ్చిన తోడనే దేశమునకతఁడు చేసిన యుపకారములంబట్టి వానిపేరు స్థిరముగా జ్ఞాపకముండునటు లేపనిజేసిన బాగుండునని యోచించుటకు బొంబాయిలో నొకసభ జరిగెను. ఏటేట నొక బంగారు పతకమతని పేర చేయించి సంస్కృతభాషావిషయుమున మంచి యుపన్యాసము వ్రాసిన విద్యార్థికి బహుమాన మిచ్చుటకును వాని ప్రతిమ నొకటి తెప్పించి జనులందఱు వచ్చుచు బోవుస్థలమున నుంచుటకును నాడు జనులు నిశ్చయించిరి. పునహానగరమందుఁగూడ నట్టి సభయే జరిగెను. అక్కడిజనులును వేదశాస్త్రపండితునకు మండలీకునిపేర నేటేట బహుమానమీయ నిశ్చయించిరి.

మండలీకుడు విద్యాభిమాని గ్రంథకర్తయని యీవఱకే చెప్పియుంటిని. మొదటనతఁడు దేశభాషలోగొన్ని గ్రంథములురచించెను. అతఁడు విద్యార్థియై యుండిననాడే యింగ్లీషులో లాటరీ యను పేర నున్న చిన్న నీతికథను మరాటిభాషలోనికిమార్చి బహుమానమందెను. తరువాత రాజకీయవ్యవహారములం దెలుపు నర్థశాస్త్రమును భాషాంతరీకరించెను. సింధు దేశమున నున్న కాలమున సింధుభాషను నేర్చికొని దానిలోఁ జిన్న వ్యాకరణమును వ్రాసెను. గుజరాతీభాషలోఁ జాలపరిశ్రమజేసి యాయన యెల్ఫినిష్టను దొరగారుచేసిన హిందూ దేశచరిత్ర నాభాషలోనికి మార్చెను. ఈగ్రంథము పాఠశాలలో