పుట:Mahaapurushhula-jiivitamulu.pdf/258

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

విశ్వనాథ నారాయణ మండలికుఁడు

213



లోను గుజరాతుభాషలోను పదునాలుగు సంవత్సరములు బి. యల్. పరీక్షలోను పరీక్షకుఁడుగా నుండెను.

1874 వ సంవత్సరమునం దాయన బొంబాయి దొరతనము వారి శాసననిర్మాణసభలో సభికుఁడయ్యెను. ఈ సభలో నిదివఱ కనేకులు సభికులై యుండిరికాని ప్రజలపక్షమువాఁడితఁడే. అది వఱకు దొరతనమువారు సాధారణముగా మహారాజులను జమీందారులను నేర్పచుటచే వారందరు గంగిరెద్దులవలె దొర లేమాటలాడిన నామాటలకే తలలూచు చుండెడివారు. మండలీకుఁడు గవర్నమెంటువారిచే నేర్పరుపఁబడినను ప్రజలకు నష్టమువచ్చు శాసనము లేర్పరచునప్పుడు ప్రజాపక్షముఁబూని పోరాడుచు ధైర్యశాలి యెంతపని చేయగలడో యిదిచూపెను, శాసననిర్మాణసభకు మండలీకునట్లు మరియొకరు తగియుండరు. ఏలయన నతఁడు పరిపూర్ణపండితుఁడు బుద్ధిశాలియగు న్యాయవాది గొప్ప యనుభవశాలి. దేశ స్థితిగతులు చక్కగా నెఱిఁగినవాఁడు. మఱియు స్వతంత్రుఁడు. అధికారులు కన్నెఱ్ఱజేసిన మాత్రమున వెరచి తన యభిప్రాయములను దాఁచుకొనువాఁడుకాఁడు. ఒకసారి వానికొక గవర్నరు బెదరించెనఁట. మండలీకుఁడపుడు వానియాటలు తనవద్ద సాగిరావని మెల్లగఁజెప్పి మందలించెనఁట. అతఁడు బొంబాయి శాసననిర్మాణసభలో వరుసగా మూఁడుసారులు సభికుఁడుగా నేర్పరుపఁ బడెను.

1884 వ సంవత్సరమునం దతఁడు గవర్నరు జనరల్ గారగు రిప్పన్ ప్రభువుగారిచేత వారి శాసననిర్మాణసభలో సభికుఁడుగా నియమింపఁ బడెను. బొంబాయి దేశస్థుఁడు గవర్నరుజనరలుగారి యాలోచన సభలో సభికులగుట కదియే మొదలు ఆసభలోఁ గూర్చుండుట కతఁడు బొంబాయినుండి పోవునప్పుడు పౌరులు వాని నుత్సవముజేసి మన్నించిరి. కలకత్తా చేరినతోడనే యానగరవాసులుగూడ వానిని