ఈతడు కొంతకాలము పాఠశాలలు పరీక్షించు సహాయపరీక్షకుడుగా, బిదప సబు జడ్జీగా, బిమ్మట దొరతనమువా రచ్చు వేయించిన పుస్తకముల విక్రయించు నుద్యోగస్థుఁడుగ ననంతరమువచ్చు బడిపన్నునుగూర్చి యేర్పడిన కమీషనరుగారికి సహాయుఁడుగానుండి యుద్యోగములు చేసెను. కాని దొరతనమువారి ఉద్యోగములో నున్నంతకాలము తన తెలివితేటలు బయలుపడవనియు దొరతనము వారు మిక్కిలి దయగలిగి యిచ్చినపక్షమున నింకొకటిరెండు గొప్ప యుద్యోగములే యిచ్చెదరనియు నల్లవారికి తెల్లవారితో సమానముగ నుద్యోగములీయరనియు నతఁడు నిశ్చయముగ నమ్మి హైకోర్టులో న్యాయవాదిగ నుండుట మంచిదని తలంచి సర్కారుపనిమాని న్యాయవాది పరీక్షయందు గృతార్థుఁడై 1863 వ సంవత్సరమున హైకోర్టులో వకీలుగ జేరెను. అప్పుడు హైకోర్టులో బుద్ధిసూక్ష్మతగల న్యాయవాదులు లేనందున మండలీకునివంటి నేర్పరికి వ్యాపకమున కవకాశముండెను. అప్పటి న్యాయవాదులలో నింగ్లీషునేర్చినవారు మిక్కిలి తక్కువ. జడ్జీలలో సహితము హిందూ ధర్మశాస్త్రము నిశ్శంకముగా నేర్చినవారు లేరు. అందుచేత నతఁడు స్వల్పకాలములోనే చాల ధనము సంపాదింప గలుగుటయేగాక జడ్జీల గౌరవములుగూడ సంపాదించెను. ప్రజలకు తన కిచ్చిన వ్యాజ్యములలో నున్న సంగతులు శ్రద్ధతో జదివి వచ్చినవారి కేదోయుపకారము చేయవలయునని తలంచువాఁడు. వేళమీరి యెన్నడు కోర్టునకు బోవలేదు. ఒకసారి పునహాకోర్టునకుఁ బోవలసియుండి బొంబాయి హైకోర్టులోనున్న పనితొందరవల్ల జాగుచేసి యతఁడు పొగబండి నందుకొనలేకపోయెను. బండి మించినది నేనేమి చేయనని వంక బెట్టక సొమ్ము చూచుకొనక బొంబాయినుండి పునహాకు తనకు బ్రత్యేక మొక పొగబండి నేర్పరచుకొని యుచిత సమయమున