పుట:Mahaapurushhula-jiivitamulu.pdf/254

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట అచ్చుదిద్దబడ్డది
[27]
209
విశ్వనాథ నారాయణ మండలికుఁడు

మిక్కిలి సంతసించి 1851 - 52 సంవత్సరములకు వ్రాసిన సంవత్సర చర్యలో వానినిగూర్చి యిట్లువ్రాసిరి. "విశ్వనాథనారాయణ మండలికుఁడు మిక్కిలి చురుకుగల విద్యర్థియని మేము నిరుడే వ్రాసితిమి. ఈసంవత్సరపు విద్యార్థులలో గూడ నతఁడే ప్రసిద్ధుఁడు. ఈసంవత్సరము పేటన్ పండితుఁడు సెలవుదీసికొనిన నెలలో నితఁడాపనిచేసెను. చేసినపని మిక్కిలి తృప్తికరముగా నున్నది.

ఆ కాలమున బి. ఏ. మొదలగు పరిక్షలులేవు. అప్పుడున్న పరిక్షలలోఁ గొప్పదానియందు మొదటివాఁడుగ మండలికుఁడు గృతార్థుడయ్యెను. విద్యాసమాప్త మగునప్పటికి కతనికి బందొమ్మిదవయేడు. అందుచే నతని గురువులలో నొకఁడు సీమకుఁబోయి సివిలు సర్విసు పరిక్షకుఁ జదువుకొమ్మని వాని నెంతయుఁ బురికొల్పె. కాని వానికుటుంబ మట్టియుద్యమమును బూననియ్యకపోవుటచే నతఁడు చిన్నతనమందే యుద్యోగము సంపాదింపవలసి వచ్చెను. సింధుదేశమున దొరతనమువారి యేజంటుగానుండి 'సర్ లిగ్రాండుజేఁకబు దొర'గారు కార్యనిర్వాహకమందుఁ దనకు సహాయకుఁ డొకఁడు కావలయునని కోరగా గొందఱు దొరలు మండలీకు నప్పగించిరి. ఆజేకబుదొరగారు తనక్రింద పనిచేయుచున్న మండలీకునిమీఁద జాల నభిమానముగలిగి యాకాలపు గొప్ప దొరల పరిచయము వానికిఁ గలుగఁజేసెను. మండలీకుఁడు కనఁబడు సుగుణముల కన్నిఁటికిఁ గారణ మాదొరలతోఁ దాను చేసిన స్నేహమే యని పలుమారు చెప్పుచువచ్చెను. అతఁడు వారివద్దనుంచి నేర్చుకొనిన గుణములివి. పట్టుదలతోఁ బనిచేయుట, కార్యదీక్ష, సంపూర్ణ స్వతంత్రబుద్ధి మఱియు నీ గుణంబులకు మెఱుగుబెట్టిన దొకటి గలదు. అది యేమన తన యర్హకృత్యమునం దేమరుపాటు లేక పని చేయుట.