పుట:Mahaapurushhula-jiivitamulu.pdf/24

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ఈశ్వరచంద్ర విద్యాసాగరులు

15



బుద్ధి సర్వతోముఖవ్యాప్తముకాగా నాతఁడు బహుగ్రంథ నిర్మాతయయి విద్యావిశారదుఁడై సంఘసంస్కారకుఁడైఁ భూతదయాళుడై జన్మము చరితార్ధముగఁ జేసికొనెను. బంగాళాభాషలో వానివ్రాతలు మృదువులై మధురములై పరిశుద్ధములై శయ్యా సౌష్ఠవమునకు గణుతి గావించినవి. పై నుదహరింపఁబడిన గ్రంథముగాక బంగాళా దేశ చరిత్రము, సత్పురుషుల జీవిత చరిత్రము, బోధోదయము, సీతా వనవాసము మొదలగు గ్రంథములు రచించి ప్రచురించెను. ఇవిగాక సంస్కృతమున కాళిదాస ప్రణీతమగు శాకుంతల నాటకమును బంగాళీలోనికి భాషాంతరీకరించెను. స్త్రీవిద్య యన్నచో నీతని కభిమాన మెక్కుడగుటచే తద్విషయమయి యావజ్జీవము నధిక పరిశ్రమజేసెను. "బెత్యూను" పాఠశాల యభివృద్ధి నొందుటకుఁ గారణము విద్యాసాగరునకు దానిపైఁగల యభిమానము దానివిషయమయి పడిన పరిశ్రమ కారణము నని గ్రహింపవలెను. స్త్రీవిద్య యెడల నీయనకుఁగల యాదరమునుబట్టి బెత్యూన్ కళాశాలలో మూడవతరగతిలో జదువుకొని ప్రవేశపరీక్షకుఁ బోవఁదలఁచు హిందూబాలికకు విద్యాసాగరుని జ్ఞాప కార్థ వేతన మొకటి యిప్పటికి నీయఁబడుచున్నది. సర్వకళాశాలలో నాంగ్లేయపండితు లుపాధ్యాయులయి యెంతచక్కగఁ బని చేయుదురో స్వదేశీయులు నట్లే యింగ్లీషు భాషలో పండితులై యుపాధ్యాయులై కళాశాలల నిర్వహింప సమర్థులని లోకమునకుం దెలియఁ జేయుటకయి విద్యాసాగరుఁడు మెట్రాపాలిటన్ కాలేజను పేర నొక కళాశాలను స్థాపించెను. ఇది బంగాళా దేశములోని సర్వ కళాశాలలలో శ్రేష్ఠమయినదని కీర్తిబడసినది. దొరతనమువారి క్రింది యుద్యోగమును మానుకొనుటచే నాతనికి ధననష్టమించుకయు గలుగ లేదు. పాఠశాలలలో బాలురు చదువుట కుప యుక్తములగు పుస్తకము లదివరకు బంగాళీభాషలో లేమింజేసి విద్యాసాగరుఁ దుద్యోగము మానిన పిదప నట్టి గ్రంథములు వ్రాసి ప్రచురించెను.