పుట:Mahaapurushhula-jiivitamulu.pdf/235

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట అచ్చుదిద్దబడ్డది
194
మహాపురుషుల జీవితములు

గ్వాలియరు సంస్థానములో నితడు పదునైదవయేటనే యుద్యోగమునఁ బ్రవేశించెను. మొట్టమొదట నొకగొప్ప యుద్యోగస్థునిచేతి క్రింద కొంతకాల మతఁడు లెక్కలువ్రాయుచు వచ్చెను. ఈ చిన్న యుద్యోగములో నతడు చూపిన చాకచక్యము పూనిక గ్రహించి మెచ్చి తండ్రియనంతరమున నదివఱ కాయన చేయుచుండిన సుబేదారుపని దినకరరావుకిచ్చిరి. అతఁడు పరిపాలింపవలసిన పరగణా మిక్కిలి కష్టతరమయినదగుటచే దినకరరావు తనలో నడిగియుండిన యద్భుతశక్తినంతయు వెలికిదెచ్చి కడునేర్పుతో నధికారముజేసెను. అవసరమయిన చోటుల పోలీసుస్టేషనుల గట్టించెను. సర్కారుసిస్తు సరిగ వసూలు చేయుటకు తగినపద్ధతు లేర్పరచెను. క్రింది యుద్యోగస్థులు నడుపవలసిన నడత యిట్టిది యని దెలియ జేయుట కొకనిబంధన గ్రంథము వ్రాసెను. ఈ కార్యములను నతడు చేసిన తక్కిన మార్పులనుజూచి గ్వాలియరు మహారాజుగారును వారివద్దనుండు నింగ్లీషువారి రెసిడెంటును చాల సంతోషించిరి. ఈ కార్యములే దినకరరావు యొక్క భవిష్యదభివృద్ధికి యశస్సునకు విత్తనము లయ్యెను.

దినకరరా వొక్కడు సంస్థానములో నొక చిన్న భాగమును సరిగా బాలించిన మాత్రమున సంస్థానమున కంతకు నేమిలాభము కలుగును. తక్కినవారందఱు వానిలాగున పాటుపడినచో మిగుల లసభముండును. అట్లు గాకపోవుటచే 1844 వ సంవత్సరము మొదలుకొని సంస్థానము మిక్కిలి క్షీణదశకు వచ్చెను. పూర్వపు మహారాజు పోవుటచే నప్పటిమహారాజు; బాలుడు రాజకుటుంబము బహుకలహ భూయిష్టమయియుండెను. వ్యవహారము సరిగ జరుగదయ్యె. అర్ధ ప్రాణములకు క్షేమము తక్కువయ్యెను. ఎచ్చట జూచిన నేరములు తరుచయ్యెను. అధికారులు లంచగొండులయి ప్రజలను బాధింప