పుట:Mahaapurushhula-jiivitamulu.pdf/234

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది
[25]
 

రాజా సర్ దినకరరావు

ఈయన మహారాష్ట్రబ్రాహ్మణుడు. బొంబాయి రాజధాని యందలి రత్నగిరి జిల్లాలోనున్న దేవరూటు గ్రామ మీయన జన్మస్థానము. ఇతఁడు 1819 వ సంవత్సరము డిశంబరు 30 వ తారీఖున జన్మించెను. ఈయన తండ్రిపేరు రకోబాదాదు. ఆయనకు దినకరరావు ప్రథమ కళత్రమువలనఁ బుట్టిన పుత్రుఁడు. దినకరరావు యొక్క పూర్వులు మూడు నాలుగు తరములనుండి సింధ్యామహారాజుగారి గ్వాలియరు సంస్థానములో నేదోయొక పరగణాకు సుబేదారులుగ నుండుచువచ్చిరి. ఈతని యొక్క బాల్యమునుగూర్చి మన కంతగా తెలియదు. అయిదవయేటనే యక్షరాభ్యాసము చేసి మాతృభాషయగు మహారాష్ట్రమును వానికిఁ దండ్రిగారు చెప్పించుచు వచ్చుచుండిరనిమాత్రము తెలియుచున్నది. స్వభాషకుఁ దోడు దినకరరావు సంస్కృత పారసీభాషలఁ గూడ నేర్చెను. యుక్తవయస్కుడయినపిదప నితడు పూర్వాచార పరాయణుండయి చేయవలసిన కర్మలు కాలాతిక్రమణము కాకుండ యథా విధిగ జేయుటంబట్టి బాల్యమునం దీతనికి మత సంబంధమయిన బోధనము గట్టిగా జరిగియుండునని తోచెడును. ఈయనకు హిందువుల గానము నందు మిక్కిలి యభిరుచిగలదు; హిందూవైద్య శాస్త్రమునందు జాలమట్టు కభినివేశముగలదు; బుద్ధి సూక్ష్మత గలవాడగుటచే నేవిద్య నభ్యసించిన నది యల్ప కాలముననే రాదొడగెను. ఆతడును సమయము చిక్కినప్పుడు వదలక తన జ్ఞానాభివృద్ధి చేసికొనుటకు మిక్కిలి పాటుపడెను. ఈయనకు నలువది సంవత్సరములు వచ్చు వఱకు నింగ్లీషుభాషరాదు. చదువ నారంభించిన వెనుక నతఁడచిర కాలములోనే దానిని చక చక మాటలాడ నేర్చెను. దినకరరావు గారికి జ్ఞాపకశక్తి మెండు.