పుట:Mahaapurushhula-jiivitamulu.pdf/229

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట అచ్చుదిద్దబడ్డది
190
మహాపురుషుల జీవితములులేరని కఠినముగా వ్రాసెను. ఆవ్రాత గురువునకు నషాలమంటి తల వెఱ్ఱి యెత్తించినను యెందుచేతనో వారు కొంతకాల మూరకుండి దుస్సహమయిన యీ పరాభవమునకుఁ బ్రతిక్రియఁ జేయుటకు గాఁబోలు 1861 వ సంవత్సరమున మేనెల 14 వ తారీఖున నతఁడు కృష్ణదాసు మూల్జీమీఁద ప్రతిష్ఠ నష్టమునకు బొంబాయి హైకోర్టులో నొక యభియోగము (దావా) తెచ్చెను. కృష్ణదాసుమూల్జీ యీ దోషారోపణకుఁ దాను నేరస్థుఁడు కాఁడనియు, వ్రాసినవ్రాత వారి కప్రతిష్టాకరము కాదనియు దాను వ్రాసిన దానిలోఁ బ్రత్యక్షరము నిజమే యనియు వాదించెను.

అంతియగాక వల్లభమత గ్రంథములలో వ్యభిచారము భక్తిగఁ జెప్పఁబడి యున్నదనియు నీ మతగురువు లందఱు వ్యభిచరించుచునే యుందురనియు సూరతు గురు మహారాజుగారు కూడ నట్టి తెగలోనివాఁడే కాని వారికంటె భిన్నుఁడు కాఁడనియు మూల్జీ కోర్టువారికి విన్నవించెను. అనంతరము కృష్ణదాసు చేయుచున్న మహోపకారమును దెలిసికొన లేక మూర్ఖులయి భట్టియా జాతివారు సభయొకటిచేసి గురుమహారాజులకు విరుద్ధముగ నెవ్వరు కృష్ణదాసు పక్షమున సాక్ష్యమియ్యగూడదని నిర్ధారణచేసికొనిరి. ఈ నిర్ధారణము గురువులకు శిష్యులకు నష్ట మేగాని లాభము గలిగింప లేదు. ఏలయనఁ దన కులస్థులందఱు జేరి తనపైఁ గుట్రలు పన్ను చున్న వారిని కృష్ణదాసు వారిపై నొక యభియోగము దెచ్చెను. గురువులు తెచ్చిన దావా యటుండ మూల్జీ కులస్థులపై దెచ్చిన యభియోగములో న్యాయాధిపతులు భట్టియాలలో ముఖ్యులగు నిద్దఱకుఁ జెరియొక వేయిరూపాయిలను మఱి యెనమండ్రుగురిలో నొక్కొక్కని కైదువందల రూపాయిల చొప్పున ధనదండన విధించిరి. ఆనాఁడు మూల్జీ కోర్టునుండి యావలకుఁ బోగానే యోడిపోవుటచేత కడుపుమండి