పుట:Mahaapurushhula-jiivitamulu.pdf/217

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది
180
మహాపురుషుల జీవితములు

కుమారుల కిద్దఱకు మొత్తముమీఁద నలుబదియాఱువేల రూపాయ లిమ్మని వ్రాసెను. అవి మొదటవ్రాసి తరువాత రెండు సంస్కృత కళాశాలల స్థాపించుటకు నందలి విద్యార్థుల కన్నము పెట్టుటకు నొక చెరువు త్రవ్వించుటకు నొక ధర్మశాల కట్టించుటకు నొకలక్ష పదునైదువేల రూపాయ లిమ్మినియెను. పిమ్మట ననేకధర్మకార్యముల నిమిత్తము గోకులదాసు రమారమి ఎనిమిదిలక్షల రూపాయలిమ్మని వ్రాసి ప్రతిధర్మకార్యము నిర్విఘ్నముగా సాగునట్టు లేర్పాటులు చేసెను. ఈ మొత్తములో డెబ్బదియైదువేల రూపాయిలు వేరుగా నుంచి దానిమీఁద వచ్చినవడ్డీతో నిద్దఱుగుమాస్తాలను, ఒకకార్యదర్శి (సెక్రటెరి)ని వేయవలసినదనియు, తాను చేసిన ధర్మకార్యములన్నియు సరిగా జరగుచున్నవో లేవో చూచుటయు వారిపనిగానుండవలసిన దనియు, నతఁడు శాసనములో వ్రాసెను. ఆకార్యదర్శి సంవత్సరాంతమున లెఖ్కలన్నియు దొరతనమువారి గణికులచేత సరిచూపించి యింగ్లీషుభాషలోను గుజరాతీభాషలోను తప్పక యా లెక్కలను ప్రకటింపవలసిన దనికూడ నతఁడు నియమించె. దగ్గర చుట్టములను సరిగ జ్ఞాపక ముంచుకొని యెవ్వ రెవ్వరికి కెంతధన మియ్యవలయునో యంతధనమునిచ్చి వారిలో సంతానములేని స్త్రీలకు యావజ్జీవ మనుభవించునట్లు స్వాతంత్ర్యమిచ్చి తక్కినవారికి సంపూర్ణ స్వాతంత్ర్యమిచ్చి గోకులదా సందఱి మెప్పుల వడసెను. ఇవన్నియు వ్రాసి కడపటి నతఁడు తన యుత్తరక్రియలకు భార్యశ్రాద్ధములకు నొకవేళ తానే ముందుగా బోయినయెడల తనతల్లి పరలోకక్రియలకు, దగిన యేర్పాటులు చేసెను.