పుట:Mahaapurushhula-jiivitamulu.pdf/216

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

గోకులదాసు తేజ్‌పాలు

179

గుజరాతివారి విద్యాభివృద్ధినిమిత్తము రెండుపాఠశాలలు స్థాపించెను. అవిగాక బొంబాయిలో నతఁడొక ధర్మవైద్యశాల పెట్టించి దాని పోషణము నిమిత్తము లక్షయేబదివేల రూపాయిలనిచ్చెను. ఆవైద్యశాలకు నింకను గావలసిన కర్చులు బొంబాయి మునిసిపాలిటీవారు దొరతనమువారు వహించి గోకులదాసు పేర దానినిప్పుడు జరుపు చున్నారు.

బొంబాయిలో నున్న గొప్పవైద్యశాలలు మూడు. అందులో గోకులదాసు తేజపాలుగారి దొకటి. ఈ దానములు గాక గోకులదాసు తన మరణశాసనములో మరికొన్నిసత్కార్యముల నిమిత్తము ధనదానము చేయవలసినదని మిక్కిలి విస్పష్టముగా వ్రాసెను. ఈ మరణశాసనము మిక్కిలి బాగుండుటచే నేఁటికిని బొంబాయిలో మరణశాసనములు వ్రాయఁదలంచువా రనేకులు దీనినే మాదిరిగా పుచ్చుకొని వ్రాయుచుందురఁట దానికంత ప్రసిద్ధివచ్చుటకుఁగారణ మేమన దానిలో రెండు గొప్పవిశేషము లున్నవి. అందు మొదటిది ఆ మరణశాసనముబట్టి తదనంతరము ధర్మ కార్యములు జరుపువారే ధర్మ మెట్లు జరపవలయునో దేని కేయేసాధనసామగ్రులు కావలయునో యాయానిబంధనలన్నియు నందు విస్పష్టముగాఁ జెప్పఁబడి యున్నవి. అందుచే దాతయొక్క ముఖ్యోద్దేశ మెప్పుడు జరగక తప్పదు. రెండవది ఆ శాసనములో గోకులదాసు తన బంధువులకు తనయొద్ద పనిచేసిన సేవకులకుతన్ను నమ్ముకొనియున్న యనుజీవులకు మరచిపోక వేరువేరుగ నొక్కొక్కనికి గొంతసొమ్మియ్య వలయునని వ్రాసెను. ఆ శాసనములందు మొట్టమొదట చిరకాలము తన్ను సేవించిన పరిచారకునకుఁ దనయనంతరమున శ్రాద్ధకర్మచేయించు బ్రాహ్మణునకుఁ దనకుఁ జాలకాలము వండిపెట్టిన వంటవానికిఁ బూర్వము తనవద్ద సేవకుఁడయి యుండి మృతినొందిన యొక వృద్ధుని