పుట:Mahaapurushhula-jiivitamulu.pdf/188

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

స్వామి దయానంద సరస్వతి

157

జేయఁదలఁచిన మహాత్ముఁడగుటచే దయానంద సరస్వతీస్వామి హిందువుల యందఱి గౌరవమునకుఁ బాత్రుఁడు.

ఈయన స్థాపించినమతము దేశాభివృద్ధికి మిక్కిలి సహాయకరముగ నున్నది. వేదమునే పరమప్రమాణముగా నితఁడు గ్రహించుటచేత నితనిమత ముత్తర హిందూస్థానములో మిక్కిలివ్యాపించు చున్నది. ఈ మతస్థులు వివాహములు వేదమంత్రప్రకారముగాఁజేసి కొందురు. మన మతములోనుండి మహమ్మదీయ మతములోఁగాని క్రైస్తవమతములోఁగాని కలిసిచెడిపోయినవారిని మరల నీమతస్థులు తమమతములోఁ గలుపుకొందురు. అంతియెగాక యితర మతస్థుఁ డెవండైన మన మతములోఁ జేరదలచుకొన్న పక్షమున వానిని గూడ నిరాటంకముగఁ జేర్చికొందురు. ఈ మతస్థులలో గొందఱు సన్యాసులై జనులందఱా సత్యమతము నవలంబించవలసినదని బోధించు చున్నారు. ఈ మతవ్యాప్తి నిమిత్తము లోకోపకారు లనేకులు పత్రికలు స్థాపించియున్నారు. శ్రీమంతులగు కొందఱు పాఠశాలలను, సర్వకళాశాలలను స్థాపించి తక్కిన పాఠములతోపాటు ఈ మత సిద్ధాంతములనుగూడ బాలురకుఁ జెప్పించుచున్నారు. అల్పకాలమున నీమత మింత యధికముగ దేశమున వ్యాపించుటకుఁ గారణము దయానంద సరస్వతీ స్వామియొక్క గొప్పతనమే యని తెలియవలెను. ఈయనవద్ద పాండిత్య మెంతయున్నదో సత్ప్రవర్తన మంతియ యున్నది. చిన్న తనమునందే వివాహ మక్కరలేదని వైరాగ్యమునుబూని సన్యసించిన మహాత్ముఁడు శంకరాచార్యుని తరువాత నీతఁడొక్కడే యని తోచుచున్నది. ఆయన పాండిత్యమును, శాంతమును, యోగ్యతనుజూచి రాజాధిరాజులు సయితము