పుట:Mahaapurushhula-jiivitamulu.pdf/187

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

156

మహాపురుషుల జీవితములు

మోటము లేక చెప్పఁగలిగెను, మంచిదని నమ్మినపని స్వయముగ నాచరించెను. ఆయనకు సత్యమునందుఁ గల యాదర మింతింత యనరాదు. ఒకసారి బ్రాహ్మణు లనేకులు వానివద్దకువెళ్ళి స్వామీ మీరెవరో యవతారపురుషులు మీమత మంతయు బాగున్నది. గాని విగ్రహములను దూషించుట బాగులేదు. విగ్రహదూషణ మానుదురేని మిమ్ము మేము గురువుగ నంగీకరింతు మని పలికిరి. ఆపలుకులువిని స్వామి కోపించి నన్ను మీరు గురువుగా నొప్పుకొనకున్న సరే నేను సత్యమును విడువను. నేను నమ్మిన దానిని జనులకు బోధించెదను. అని కఠినముగఁ జెప్పెను.

దివ్యజ్ఞాన మనుపేరుగల (తియసాఫికలు సొసయిటీ) వారు దయానందస్వామిని దమసంఘమున కధ్యక్షుఁడుగ నేర్పఱచిరి. కాని యాసమాజస్థాపకురా లగు బ్లానట్క్సీదొరసానిగా రొకగ్రామములో దేవుఁడు లేఁడని యుపన్యసించెనని విని యాస్వామి యా సమాజముతో సంబంధము వదలుకొనెను.

ఆయన శరీర మింగ్లీషువారి శరీరమువలె తెల్లగానుండును. మనుష్యుఁ డాజానుబాహుఁడు. ఆయన విగ్రహముఁ జూచినవారందఱికి తక్షణమే వానియందు భక్తికుదురును. దయానందుఁడు పరమ శాంతుఁడు, భూతదయాళువు, సుగుణరత్నాకరుఁడు. జితేంద్రియుడు, మహాపండితుఁడు నాలుగు వేదములకు స్వయముగ వ్యాఖ్యానము వ్రాసెను. శాంకరాచార్య విద్యారణ్యస్వాముల తరువాత నింతటి పండితుఁడు నింతటి మతబోధకుఁడు భరతఖండమున నుద్భవింప లేదని యనేకులు పలికిరి. ఆయన మతములో నిప్పుడు లక్షలకొలఁది చేరి యున్నారు. అందు కొందఱు మహారాజులుగూడ గలరు. ఆయన మతములో మనముచేరినఁ జేరకున్న దేశమునకు మహోపకారముఁ