పుట:Mahaapurushhula-jiivitamulu.pdf/182

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

స్వామి దయానంద సరస్వతి

151

గాదని చెప్పుట మానినపక్షమున మిమ్మాగుడికి మహంతునిజేసి యా సొత్తు మీయధీనముచేసెదనని పల్కెనటఁ! అప్పలుకులువిని దయానందుడు మహాకోపోద్దీపితుఁడై యట్టి దుర్భాషల నెన్నడు నాడవద్దనియు నెన్నికోట్ల ధనమిచ్చిన దాజెప్పదలచుకొన్నది చెప్పక మాన ననియు పలికి రాజుంగట్టిగ చీవాట్లు పెట్టెను. రాజుభయపడివానిపాదములపై బడి క్షమింపుమని వేడుకొనెను. అనంతరము దయానందుఁడు షాపూరు మహారాజుగారి పట్టణమునకుఁబోయి యచటకొన్నాళ్ళుండి వానికి రాజధర్మములునేర్పెను. అచట నుండగనే జోథ్‌పూరు మహారాజుగారు తమయూరువచ్చి తమ్ముపవిత్రులఁ జేయుమని వానింబ్రార్థించెను. ఆవేఁడుకోలు విని మన స్వామి జోథ్‌పురమును ప్రవేశించెను. అప్పటికి జోథ్‌పుర మెట్లుండవలయునో యట్లుండెను. మహారాజు నాంజహాన్ అను వేశ్యాంగన వలలోఁ దగులుకొని రాజ్యతంత్రములకు విముఖుఁడై యుండెను. మంత్రులు తక్కినయుద్యోగస్థులుతగని పన్నులు గట్టి ప్రజల వేధింపఁ జొచ్చిరి. రాజబంధువులు రాజుకంటె నెక్కుడు దుర్ణీతిపరులైరి. వేయేల సంస్థాన మంతయు వర్ణింపరాని దురవస్థలో నుండెను. దయానందుఁ డచ్చటికిఁబోయి సంస్థాపనస్థితిఁ గనిపెట్టి రాజును మంత్రులను మంచిత్రోవకు త్రిప్ప ప్రయత్నించెను. రాజు బాగుపడినచో తమయాటలు సాగిరావని దమపాలిటి కీయతి యెక్కడ దాపురించెనని విచారించి యుద్యోగస్థులు కొందఱు స్వామియెడ ద్వేషముఁబూనిరి. అది యటుండ వెలయాలుపొత్తులు మరగి నందు కతఁడు రాజును పలుమాఱులు చీవాట్లు పెట్టెను. ఒకనాఁడు దయానందసరస్వతి మహారాజును సందర్శించుట కంతఃపురమునకు వచ్చెను. ఆయన వచ్చునప్పటికి మహారాజుగారు నాంజహానుతోఁ గలసి ముచ్చటలాడుచుండిరి. స్వామి నల్లంతదవ్వులఁ జూచినంతనే మహారాజు దద్దరిలాడి మిండకత్తె నావలకుఁ బొమ్మని యానతిచ్చెను.