పుట:Mahaapurushhula-jiivitamulu.pdf/175

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట అచ్చుదిద్దబడ్డది
144
మహాపురుషుల జీవితములుజేరెను. వేరొకసారి నర్మదాసాగరసంగమమువద్ద నెవరో మహాత్ముఁ డున్నాఁడనివిని యచటికిఁ బయనమైపోయెను. దారిలో బ్రహ్మదండి ముండ్లువిరిగి కాళ్ళనెత్తురువరదలై మాంసము పైకిఁగనబడునట్లు తొక్కలూడినను సరకుసేయక దయానందుఁ డా పయనము చేసి చేసి యొకనాఁడు సాయంకాలము నడువలేక యొక యూరుబైట చెట్టు క్రింద యొడలెఱుంగక నిద్రించెను.

ఆరాత్రి యాగ్రామస్థులు పెద్దయుత్సవ మేదో చేసికొనుచు దివిటీలతో నూరుబైటకు వచ్చిరి. ఊరుపెత్తనదారు మఱికొందఱు చెట్టుక్రింద నిద్రించుచుండిన బాలునిచుట్టుమూగి లేపి యూరిలోనికి రమ్మనిరి. ఆతఁడు నడిచి రాఁజాలనని చెప్ప వానియందు పరమ భక్తుఁడై పెత్తనదారు వడివడి నింటికిఁ బోయి పాలు పండ్లు పంపి యారాత్రి వాని కపాయము రాకుండఁ దనమనుష్యులను వానికిఁ గావలియుంచెను. మఱునాఁ డక్కడనుండి బయలుదేఱి దయానందుఁడు మహాత్మునిఁ జూచి సన్యాసాశ్రమమును స్వీకరించి తన జ్ఞానము నింకను వృద్ధిచేసుకొనఁ గోరి మధురాపురమున నొక గొప్ప పండితుఁ డున్న వాఁడనివిని యచటి కరిగెను. ఆ పండితునిపేరు విరజానందుఁడు. విద్య గరపుటలో నతడు ప్రాచీన పద్ధతిలోనివాఁడు. శిష్యులకు శాస్త్రములు నేర్పునపుడు ఋషికృతములగు ప్రాచీన శాస్త్రములనే గాని నవీనులు చేసిన సిద్ధాంతకౌముది మొదలగు గ్రంథములను నేర్పుట కిష్టము లేనివాఁడు.

దయానందుఁ డాయన వద్దకుఁబోయి తనరాకకుఁ గారణ మెఱిఁగింప సన్యాసికిఁ దాను చదువు చెప్పనని విరజానందుఁడు పలికెను. ఎట్లయినఁ దన్ననుగ్రహింపు మని దయానందుఁడు వాని పాదములమీద పడి యెంతయుఁ బ్రార్థింప విరజానందుఁ డెట్టకేలకుఁ గృపాళువై శిష్యుఁడుగ వానినిఁ బరిగ్రహించి యదివఱ కతఁడు