పుట:Mahaapurushhula-jiivitamulu.pdf/145

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది
118
మహాపురుషుల జీవితములు

లనుగూర్చియు రెండవది బంగాళాదేశవృద్ధులు భోగపరాయణత్వము కపటమును గూర్చియు వ్రాయఁబడెను. ఈగ్రంథమువలన నతనికి గొంతపేరు గలిగెనుగాని వానికి మిక్కిలి ఖ్యాతి యతఁడు తరువాత రచియించిన పద్య కావ్యములవలనఁ గలిగెను. మొదటనుండియు నతనికి పద్యములలో యతిప్రాసము లుండుట యిష్టములేదు. అందుచేత యతిప్రాసములులేని పద్యములు వ్రాయుట మంచిదని యట్లు చేయ నిశ్చయించెను. యతిప్రాసలులేని వట్టిపద్యములు రసవంతముగా నుండవని యానాఁటిపండితులు నైకకంఠ్యములుగ నమ్మిరి. ఇతరులుమాట యేల? మధుసూదనదత్తునకు నధికసహాకారియై వానికిం బ్రోత్సాహముకలుగఁజేసిన మహారాజా జ్యోతీంద్రమోహన టాగూరు గారే యట్టి కవిత్వమును గూర్చి సందేహించిరి. అయినను దత్తు యతిప్రాస శూన్యమైన కావ్యమును రచియించుటకుఁ గృతనిశ్చయుఁడగుటచే టాగూరుగారు దాని నచ్చు వేయించుటకు వాగ్దానము చేసిరి. ఆ సహాయమునుజూచుకొని మధుసూదనుఁడు తిలోత్తమయను నిర్యతి ప్రాసకమయిన పద్య కావ్యమును రచియించి 1860 వ సంవత్సరమునఁ బ్రకటించెను. అపూర్వరచనగల యాపద్య కావ్యము ప్రకటింపఁబడిన తోడనే బంగాళాదేశమున గలిగిన కళవరము రమేశచంద్రదత్తుగా రీక్రింది విధముగా వర్ణించియున్నారు.

"నిర్యతిప్రాసకమయిన యీ గ్రంథము కనఁబడినతోడనే పండిత మండలమంతయు నాశ్చర్యమునొందెను. కల్పనాగౌరవము వర్ణనాచమత్కృతి శయ్యామృదుత్వము మొదలగునవి యందులేవని యెవ్వరు ననఁజాలరు గాని యతిప్రాసలు దీసివేయుటకు సాహసించి నందుల కిష్టపడక పండితులం దరు వాని పుస్తకము చెడిపోయినదని పలికిరి. ఈసాహసమునకుఁ గొందఱు వానిని పరిహసించిరి. కొందఱు నిందించిరి. ఈశ్వరచంద్రగుప్తుడు మొదలగు ప్రాచీనపద్ధతి కవులును