పుట:Mahaapurushhula-jiivitamulu.pdf/144

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

మధుసూదనదత్తు

117

స్వదేశీయులు నాంగ్లేయులుఁగూడ గడుమెచ్చిరి. ఇంగ్లీషుకవులలోఁ గడు ఖ్యాతివహించిన స్కాటు బేరను మొదలగువారి కవనములకు దత్తుకవనము దీసిపోదని యొక యింగ్లీషు వార్తాపత్రిక దనయభిప్రాయము నిచ్చె. ఈ పద్య కావ్యమును మధుసూదనుఁడు కలకత్తాలో నున్న బెత్యూను దొరగారికిఁ బంపినప్పు డాయన దానిం జదివి మహానందభరితుఁడై మధుసూదనదత్తునకు నొకజాబువ్రాసి దానిలో "నీవాంగ్లేయభాషలో జేసిన పరిశ్రమము స్వభాషలోనే చేసి దానికై యుపయోగించినకాలము నీస్వభాషకై యుపయోగించి గ్రంథములు రచించిన పక్షమున నీవు దేశోపకారము స్వభాషాభివృద్ధియుఁ జేయుటయే గాక నింతకంటె నెక్కుడు ప్రసిద్ధిని గాంచఁగలవు సుమీ" యని హితోపదేశముచేసెను. ఆ యుపదేశమును మన్నించి దత్తు వెంటనే కలకత్తానగరమునకు 1856 వ సంవత్సరమున వచ్చెను.

చెన్నపురమం దెనిమిది సంవత్సరములు వసియించినను వాని భాగ్యముకనుబొమ్మమీఁది వెండ్రుకవలె నెదుగుబొదుగులేక కలకత్తానుండి బయలు దేరినప్పు డెట్లుండెనో మరల కలకత్తాకు వచ్చినప్పు డట్లేయుండెను. జీవనాధార మేదియు లేకపోవుటచే నతఁడు రాగాఁనే కలకత్తా పోలీసుకచ్చేరిలో నొకగుమస్తాపని సంపాదించి తెలివితేటలు గలవాఁడగుటచే కొలఁదికాలములోనే తర్జుమాచేయు నుద్యోగస్థుఁడయ్యెను. ఇట్లు బ్రదుకుతెర వేర్పరచుకొని మనస్థ్సిమితము నొందిన పిదప దత్తు బెత్యూను చెప్పిన హితోపదేశము చొప్పున నడువఁ దలంచి బంగాళీభాషలోనున్న గ్రంథములను సమగ్రముగఁ జదివి 1858 వ సంవత్సరమున శర్మిష్ఠయను నొక నాటకమును రచియించి ప్రకటించి మరుసటి సంవత్సరమున పద్మావతియను మఱియొక నాటకమును వ్రాసెను. ఈనాటకము రచించిన వెంటనేయతఁడు రెండు ప్రహసనములు వ్రాసెను. అందొకటి బంగాళాబాలకులదురాచారము