పుట:Mahaapurushhula-jiivitamulu.pdf/138

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట అచ్చుదిద్దబడ్డది
[15]
113
కృష్ణమోహనబెనర్జిషణ పూర్వకముగా నున్నది. ఈపుస్తకము మన దేశమున కింగ్లాండు నుండి వచ్చు దొరల కత్యంతోప యుక్తముగాఁ నున్నది. రెండవ గ్రంథము క్రైస్తవమతము నందలి సత్యమునుఁ గూర్చి వేదములలో ప్రమాణము లున్నవని చెప్పుచున్నది, వేదమందున్న ప్రజాపతి శబ్దము యేసుక్రీస్తునకే యర్థమిచ్చుచున్నదని యతఁడీ గ్రంథమునందు సాధించెను.

కృష్ణమోహను బెనర్జీ క్రైస్తవమతములోఁ గలిసిన కొంత కాలమువఱకు మిక్కిలి మతావేశముగలవాడై తక్కిన మతస్థులను గఠినముగాఁ దూలనాడుచువచ్చెను. కాని వయస్సు ముదిరినకొలది యన్యమతసహనము గలవాడై సమస్తజనముల యెడల ప్రేమఁ గలవాఁడై యందఱి గౌరవమునకుఁ బాత్రుఁడయ్యెను. క్రైస్తవమత బోధకులు దేశస్థులగు బీదలయెడల పరమదయాళులై వారి కనేకోపకారముల చేసిన పక్షమునఁ గ్రైస్తవ మతమునందుఁ బ్రజల కాదర మెక్కుడు గలుగునని యాయన యభిప్రాయపడి తక్కువ జాతులవారికిఁ బలుమారు లుపకారములు సేయుచువచ్చెను. అందుచేత తన మతాభివృద్ధి యెటులున్నను ప్రజానురాగము మాత్ర మతనియందు హెచ్చుగా నుండెను. క్రైస్తవసంఘము వా రీయనకు 'రెవరెండు' అను బిరుదము నిచ్చిరి. విద్యాశాఖవా రనఁగా యూనివరుసిటీవా రతనికి మహాపండితుల కీయఁదగిన యల్. యల్. డీ. యను బిరుదమునిచ్చి గౌరవించిరి. ఈయన 1885 వ సంవత్సరము మేయి నెలలో కాలధర్మము నొందెను. ఆ కాలమందు బంగాళా దేశములో విద్యావిషయములు దేశాభిమాన విషయకములుఁ రాజకీయ విషయకములునగు ప్రసంగములు కృష్ణమోహనుబెనర్జీ లేనివి లేవు. ఇతఁడు మతాంతరుఁడైనను దేశాభిమానులలో నొకఁడు.


Mahaapurushhula-jiivitamulu.pdf